ఏపీ పోలీసులకు 'ఎల్లో' ఫీవర్

Update: 2016-03-07 11:30 GMT
 ఏపీ పోలీసులు ఇబ్బందుల్లో ఉన్నారట. పోలీసు ఉద్యోగం అంటేనే ఇబ్బందుల ఉద్యోగం... ఇబ్బందులు, కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పడం ఏమిటి అనుకోవద్దు.. ఈ ఇబ్బందులు వృత్తి విధానంలో ఉన్న కష్టం కాదు... రాజకీయ ఒత్తిళ్ల వల్ల వస్తున్న కష్టాలు.  మంత్రులు - అధికారపార్టీ ఎమ్మెల్యేలు - నేతల నుంచి పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు ఉంటున్నాయట. ఒక్కోసారి కొందరు పోలీసులకు వేధింపులు కూడా ఎదురవుతున్నాయట. నిత్యం ఏదో ఒక జిల్లా నుంచి డిజిపి జెవి రాముడికి ఈ తరహా ఫిర్యాదులందుతున్నట్లు తెలిసింది. కింది నుంచి వచ్చే ఫిర్యాదులపై ఏం చేయాలో తెలీక డిజిపి కూడా సంకట స్థితిలో పడ్డట్లు సమాచారం.

మరోవైపు సర్వీసులో తమ అనుభవాన్ని - సమర్ధతను ఉపయోగపెట్టుకోవడంలో చంద్రబాబు సర్కారు విఫలమైందని పలువురు ఐపిఎస్‌ లు అసంతృప్తిగా ఉన్నారు. నచ్చినవారిని తలకెక్కించుకోవడం - ముక్కుసూటిగా పోయేవారిని పక్కన పెట్టడం ప్రభుత్వంలో మామూలైపోయిందని విమర్శిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు - సర్కారు పక్షపాత ధోరణిని తట్టుకోలేక కొందరు అధికారులు బదిలీలు కోరుకుంటున్నారు. ఐపిఎస్‌ ల బదిలీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టి తొలి విడతలో పది మందికి స్థాన చలనం కల్పించగా, మరికొన్ని ట్రాన్ఫర్లు రేపోమాపో జరుగుతాయంటున్న నేపథ్యంలో ఇవన్నీ బయటకొస్తున్నాయి.

అదనపు డిజిపి ర్యాంక్‌ లో ఉన్న పోలీస్‌ కమిషనర్‌ ఒకరు ఆ పోస్టు తనకొద్దంటున్నారని సమాచారం. అలాగే పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లో ఉన్న అదే హోదా అధికారి ఒకరు కేంద్ర సర్వీసులకు పంపాలని దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఇంకా కొందరు ఐపీఎస్‌ లు ఇదే బాటలో పయనిస్తున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో సమాచారం సేకరించి ప్రభుత్వానికి చేరవేసే నిఘా విభాగ రోజువారీ కీలక నివేదికలు సర్కారుతో సంబంధం లేని  టిడిపి యువనేతకు చేరడంపై యావత్‌ పోలీస్‌ శాఖలో చర్చనీయాంశమైంది. హోం మంత్రి కంటే ముందే ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు ఆ యువనేతకు చేరుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. డిజిపిని, మొత్తం పోలీస్‌ వ్యవస్థను పక్కకుపెట్టి ఒక 'నిఘా' అధికారిపై ముఖ్యమంత్రి ఆధారపడటం, అధిక ప్రాధాన్యతనివ్వడంపై డీజీపీ రాముడు కూడా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ప్రభుత్వంలో నెలకొన్న ఈ ధోరణిపై అసహనంగా ఉన్న డిజిపి తన పదవీకాలానికి ముందే వైదొలిగితే ఎలా ఉంటుందనే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News