ఏపీ రాష్ట్ర పుష్పం ఎందుకు మారిందంటే..

Update: 2018-05-31 14:30 GMT
రాష్ట్ర విభజన జరిగిన నాలుగేళ్లయిన తరువాత ఏపీలో రాష్ట్ర చిహ్నాలను మార్చడం చర్చనీయమవుతోంది. దీనివెనుక రాజకీయ కారణాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర పుష్పం విషయంలో ఈ వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పుష్పంగా ఉన్న కలువ పువ్వు స్థానంలో ఇప్పుడు మల్లెపువ్వును ఎంచుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర పక్షిగా పాలపిట్ట స్థానంలో రామచిలుకను గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రాష్ర్టం వృక్షం వేప - రాష్ట్ర జంతువు కృష్ణ జింకను అలాగే ఉంచారు. దీంతో తాజా మార్పులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
    
నాలుగేళ్ల పాటు బీజేపీతో పాటు కేంద్రం - రాష్ట్రంలో అధికారం పంచుకున్న తెలుగుదేశం పార్టీ మొన్ననే తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.  బీజేపీ గుర్తు కమలం.. ఇది కలువ పువ్వును పోలి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమలం - కలువ చూడ్డానికి ఇంచుమించు ఒకేలా ఉంటాయి. దీంతో ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర పుష్పంగా కమలాన్ని పోలిన కలువను మార్చేసి మల్లె పువ్వును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
    
ఇక రాష్ట్ర పక్షి విషయంలో తెలంగాణ అంశం ముడిపడినట్లు ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పక్షిగా ఉన్న పాలపిట్లను తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ర్ట పక్షిగా  కొనసాగిస్తోంది. దీంతో పనిలోపనిగా ఏపీ ప్రభుత్వం తమ రాష్ట్ర పక్షిని తెలంగాణకు భిన్నంగా మార్చినట్లు భావిస్తున్నారు. చెట్టు, జంతువు విషయంలో తెలంగాణ జమ్మిచెట్టు - తంగేడు పువ్వులను చిహ్నాలుగా గుర్తించింది. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవే కొనసాగిస్తోంది.

Tags:    

Similar News