మాట‌లు కాదు.. చేత‌లు చూపండి.. రాజ‌ధానిపై బీజేపీకి ప్ర‌శ్నల వ‌ర్షం

Update: 2022-10-18 00:30 GMT
ఔను.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో బీజేపీ నాయ‌కులు అనుస‌రిస్తున్న విధానం... చేస్తున్న వ్యాఖ్య‌లు.. వంటివాటికి ఎలాంటి సంబంధం లేకుండా పోయింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని పాల‌కులు.. ఏపీకి త‌ర‌చుగా వ‌స్తున్నారు. త‌మ మ‌ద్ద‌తు అమ‌రాతికే ఉంటుంద‌ని.. మూడేంటి.. చీపుగా! అని అనేస్తున్నారు. అంతేకాదు.. త‌మ‌ను కాద‌ని.. జ‌గ‌న్ అడుగు కూడా ముందుకువేయ‌లేర‌ని  చెబుతున్నారు. ఇక, ఏపీలో అయితే.. సోము వీర్రాజు నుంచి.. సందు చివ‌రి సుబ్బారావు వ‌ర‌కు..బీజేపీ కండువా క‌ప్పుకొన్న ప్ర‌తి ఒక్క‌రూ.. ఇంకేముంది.. రాజ‌ధాని అమ‌రావ‌తే అని పాడుతున్నారు.

అంతేకాదు..రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌లో అడుగులు క‌దుపుతున్నారు. వారిలో ఉంటూ.. వారు పెట్టింది తింటూ.. న‌డుస్తున్నారు. తాజాగా బీజేపీ కీల‌క నాయ‌కుడు.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస‌రావు కూడా రైతుల‌తో క‌లిసి అడుగులు వేశారు.

అంటే.. అటు కేంద్రంలోని బీజేపీ కి చెందిన సీనియ‌ర్లు కానీ, ఇటుఏపీలో ఉన్న నాయ‌కులు కానీ.. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తేన‌ని.. మూడుకు అస‌లు త‌మ మ‌ద్ద‌తు లేద‌ని చెబుతున్నారు. ఇక‌, పార్ల‌మెంటు విష‌యాన్ని చూస్తే... అక్క‌డ ఉన్న‌ది కూడా.. బీజేపీ నేత‌లే. కానీ, ఇక్క‌డ మాత్రం మూడుపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం లేదు.

అస‌లు మూడు రాజ‌ధానులు అనే మాట రాజ్యాంగంలో లేద‌ని కానీ, అలా అయితే.. తాము నిధులు ఇవ్వ‌బోమ‌ని కానీ చెప్ప‌రు. రాజ‌ధాని రాష్ట్రాల ఇష్టం అని అనేస్తున్నారు. పోనీ.. దీనిని మోడీ చేతుల మీదుగా శంకుస్థాప‌న చేశారు.. సో.. క‌నీసం.. దాని తీరితెన్నులు చూద్దాం.. అని కూడా.. ఏఒక్క‌రూ భావించ‌డం లేదు. అది కాక‌.. రాజ‌ధాని ప్ర‌క‌ట‌న చేసిన‌ప్పుడు ఏర్పాటు చేయాల్సిన కేంద్ర ప్ర‌భుత్వ్ సంస్థ‌ల‌నైనా.. ఇక్క‌డ ఏర్పాటు చేస్తే.. ఈ మూడు ర‌గ‌డ‌కు ఎలాంటి వివాదం లేకుండా పోయేది.. కానీ, అటు కేంద్రం కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇటు రాస్ట్రానికి వ‌చ్చిన వారు మాత్రం మూడు కాదు.. ఒక‌టే అంటారు. అక్క‌డ కేంద్రంలో అధికారంలో ఉన్న‌వారు మాత్రం.. మీఇష్టం అంటారు. ఇవ‌న్నీ కాకుండా.. వైసీపీ చెబుతున్న మూడు రాజ‌ధానుల్లో ఒక‌టి.. క‌ర్నూలులో న్యాయ‌రాజ‌ధాని. దీనికి మాత్రం బీజేపీ నేత‌లు సై అంటున్నారు.

క‌ర్నులులో.. హైకోర్టు ఏర్పాటుకు తాము రెడీ అని.. బీజేపీ నాయ‌కులే చెబుతున్నారు. అంటే.. వైసీపీ చెబుతున్న వాటిలో ఒక దానికి వారు ఒప్పుకొన్న‌ట్టు అయింది క‌దా.. మ‌రి ఇదేం రాజ‌కీయం?  రైతులును మోసం చేయడానికా..?  లేక‌.. మ‌రేంటి? అనేది క‌మ‌ల నాథుల‌కే అర్ధం కావాలి. ఏదేమైనా.. క‌మ‌ల నాథులు క‌థ‌లు చెప్ప‌డం మానేసి.. చేత‌ల్లో చూపాల‌నేది ఏపీ ప్ర‌జ‌ల మాట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News