మనుషుల కన్నా జంతువుల జోస్యాలే బెటరా?

Update: 2016-11-10 06:24 GMT
తెంపరితనంతో మాట్లాడే డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికా అధ్యక్షుడు అయితే ఇంకేమైనా ఉందా? అంటూ గావు కేకలు వేసినోళ్ల నోట మాట రాకుండా ఉండేలా అమెరికన్లు తమ ఓటుతో సమాధానం చెప్పేశారు. తన అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ నేతలే నో అంటే నో అన్న వేళ.. తనను కానీ పోటీ నుంచి తప్పించాలని చూస్తే.. భారీగా నష్టపోతారు సుమీ అంటూ సొంత పార్టీ వారినే హెచ్చరించిన సత్తా ట్రంప్ సొంతం. అలాంటి ఆయన తన గెలుపు గురించి మొదట్నించి ధీమాను వ్యక్తం చేసేవారు. అందుకు తగ్గట్లే ఆయన అంచనాలు నిజమన్న విషయం నిన్న ప్రపంచానికి అర్థమైన పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ట్రంప్ విజయం సాధించే అవకాశం లేదంటూ కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలు సైతం తేల్చి చెప్పిన వేళ.. వారి సర్వే జోస్యాలన్నీ తుస్ మన్న పరిస్థితి. మీడియాకు మైండ్ బ్లాక్ అయ్యేలా తమ తీర్పుతో అమెరికన్లు షాకిచ్చారని చెప్పక తప్పదు. అమెరికా అధ్యక్ష పదవి ఎవరు చేపట్టనున్నారన్న విషయాన్ని పలు సంస్థలు అధ్యయనం చేసి మరీ వెల్లడించిన దానికి భిన్నంగా ట్రంప్ విజయం సాధించటం ఒక ఎత్తు అయితే.. ఆయన విజయాన్ని మనుషుల కంటే జంతువులే సరిగ్గా చెప్పాయన్నది నిజమని చెప్పక తప్పదు.

ట్రంప్ విజయాన్ని అంచనా వేయటంలో మనుషులు విఫలమైతే.. జంతువులు మాత్రం నూటికి నూరుశాతం పక్కాగా చెప్పటం గమనార్హం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీదే విజయమని.. ఆమె గెలుపు నల్లేరు మీద నడకగా పలు సర్వేలు స్పష్టం చేశాయి. అయితే.. వాటికి భిన్నంగా చైనా కోతి.. చెన్నై చాణక్య (చేప) మాత్రం ట్రంప్ దే విజయమని.. హిల్లరీకి ఓటమి తప్పదని స్పష్టం చేశాయి. ఇంతమంది మనుషులు వేసిన లెక్కల్ని కాదని.. నోరు లేని జంతువులు ఏం చెబుతాయి? వాటికేమైనా రాజకీయ అవగాహన ఉందా? అని సటైర్లు వేసినోళ్లంతా.. ఇప్పుడు జంతువులు చెప్పిన జోస్యాలు నిజం కావటంతో నోట మాట రాని పరిస్థితి. జంతువులకు నోరు లేకున్నా.. మనుషులకు లేనిదేదో ఉందన్నది తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News