జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరో కేసు నమోదు!

Update: 2022-11-12 10:31 GMT
జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పై మరో కేసు నమోదైంది. ఇటీవల విశాఖపట్నంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని, పార్టీ శ్రేణులతో మంత్రులపై దాడులు చేయించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు.

తాజాగా ఇటీవల పవన్‌ కల్యాణ్‌ ఇప్పటం పర్యటనకు సంబంధించి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటంలో జగన్‌ ప్రభుత్వం జనసేన పార్టీ మద్దతుదారుల ఇళ్లను కూల్చిన సంగతి తెలిసిందే. బాధితులను పరామర్శించడానికి మంగళగిరి నుంచి పవన్‌ తన కారులో బయలుదేరగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. భారీ ఎత్తున రోడ్డుకు అడ్డంగా పోలీసులు మోహరించి పవన్‌ను వెళ్లనీయలేదు.

దీంతో ఆయన దాదాపు మూడు కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోలీసులు ఇప్పటం వెళ్లడానికి అనుమతి ఇవ్వడంతో కారు బానెట్‌పై కూర్చుని ఇప్పటం వెళ్లారు. దీంతో తనకు గాయాలయ్యాయని తెనాలికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్ల ఆ సమయంలో బైకుపై ప్రయాణిస్తున్న తాను పడిపోయానని.. దీంతో తనకు గాయాలయ్యాయని తెనాలి మారీస్‌ పేటకు చెందిన శివ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పవన్‌ కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్‌ 177ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదయింది. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చోని వెళ్లడం, కార్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

అదేవిధంగా హైవేపై పవన్‌ కాన్వాయ్‌ని పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసు ఫైల్‌ చేశారు.

ఇప్పటికే జగన్‌ ప్రభుత్వంపై జనసేన పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. తమ అధినేతను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, ఆయన పర్యటనలకు ఆటంకాలు కల్పించడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదు చేయడంపై జనసేన పార్టీ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News