రాజకీయాల్లోకి మరో క్రికెటర్.. భజ్జీ ఇక ఎంపీ

Update: 2022-03-21 11:31 GMT
ఓ ఇమ్రాన్ ఖాన్, ఓ అర్జున రణతుంగ, ఓ గౌతమ్ గంభీర్, ఓ మహమ్మద్ అజహరుద్దీన్.. వీరి సరసన చేరాడు హర్భజన్ సింగ్. ఈ పంజాబీ క్రికెటర్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్య సభకు నామినేట్ అయ్యాడు. తాజాగా ఆ పార్టీ ప్రకటించిన రాజ్య సభ సభ్యుల జాబితాలో భజ్జీతో పాటు రాఘవ్ చద్దా ఉన్నారు. చద్దా.. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే.

ఇక ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పాఠక్ నూ ఆప్ రాజ్య సభకు పంపాలని నిర్ణయించింది. కాగా, ఈ నెల పదిన వెలువడిన ఫలితాల్లో పంజాబ్ లో ఆప్ 90పైగా సీట్లు సాధించి రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న ఆ పార్టీ..పంజాబ్ నూ గెల్చుకుని చరిత్రకెక్కింది.

ఈ క్రమంలోనే మార్చి 31న జరుగనున్న రాజ్య సభ ఎంపీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది.లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ చాన్స్ లర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరా కూడా ఆప్ తరఫున రాజ్యసభకు వెళ్లనున్నారు.

భజ్జీ 42, చద్దా 33
మిగతా రాజకీయ నాయకులకు భిన్నమైనదిగా భావించే ఆమ్ ఆద్మీ.. అందుకుతగ్గట్లే నిర్ణయాలు తీసుకుంటుంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి సీఎంగా ఎవరుండాలి? అనే విషయం దాకా పంజాబ్ లో ఈ విధంగానే వ్యవహరించి 92 సీట్లు నెగ్గింది. ఓ వైపు దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న బీజేపీ, మరోవైపు పంజాబీల్లో పట్టున్న శిరోమణి అకాళీదల్.

వీటన్నిటినీ తట్టుకుని ఆప్ పంజాబ్ లో విజయం సాధించింది అంటే అది మామాలూ విషయం కాదు. ఇక పోతే సీఎం అభ్యర్థిని భగవంత్ సింగ్ మాన్ ను టెలిఫోనిక్ సర్వే ద్వారా ఎంపిక చేసి ఆప్ విభిన్నతను చాటింది. ఆప్ రాజకీయాలను గమనిస్తే భవిష్యత్ నాయకత్వానికి పెద్ద పీట వేస్తుంది. అంటే యువతను నమ్ముతుంది. ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థులు కూడా ఈ తరహా వారే. క్రికెటర్ హర్జజన్ సింగ్ వయసు 42 కాగా, రాఘవ్ చద్దా వయసు 33 ఏళ్లే.

మేటి క్రికెటర్ గా భజ్జీకి ఉన్న ఆదరణ అందరికీ తెలిసిందే. అందులోనూ భజ్జీ ముక్కుసూటి మనిషి. జట్టు కోసం ఎంతకయినా తెగించి ఆడేవాడు. దేశమంటే విపరీతమైన భక్తి. 2011 ప్రపంచకప్ విజయం సందర్భంగా భజ్జీ ముంబై వాంఖడే మైదానంలో టీమిండియా జెర్సీ చూపుతూ చేసిన విజయ గర్జనలే ఇందుకు నిదర్శనం. ఇలాంటివారు కచ్చితంగా ప్రజా జీవితంలోనూ తప్పు చేయరని నమ్మొచ్చు. దీన్నిబట్టే ఆప్ రాజకీయాలు ఎంతటి ప్రత్యేకమో చెప్పొచ్చు.
Tags:    

Similar News