టీఆర్ ఎస్‌ కు మరో త‌ల‌నొప్పి.. నోరు పారేసుకున్న ఎమ్మెల్యే మ‌ల్ల‌య్య‌

Update: 2021-02-21 03:48 GMT
తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే దూకుడు మామూలుగా లేద‌నే టాక్ వినిపిస్తోంది. పోలీసుల‌ను త‌మ‌కు అనుకూలంగా మా ర్చుకుని.. తాము చెప్పిన ప‌నులే చేయించుకుంటున్నార‌ని.. కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కొన్ని వారాల కింద‌ట రాష్ట్ర హైకోర్టు కూడా ఇదే విష‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పోలీసుల‌పై రాజ‌కీయ ఒత్తిడి పెరుగుతోంద‌ని.. రాజ‌కీయ నేత‌లు త‌మ ఇష్టాను సారం పోలీసు వ్య‌వ‌స్థ‌ను వాడుకుంటున్న‌ట్టుగా అనిపిస్తోంద‌ని కూడా హైకోర్టు కీల‌క కామెంట్లు చేసింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర పోలీసుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతోంద‌న్న భావ‌న వ్య‌క్త‌మవుతోంద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇటీవ‌ల లాయ‌ర్ వామ‌న రావు దంప‌తుల దారుణ హ‌త్యోదంతం నేప‌థ్యంలోనూ ప్ర‌బుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. సాక్ష్యాల‌ను నిల‌బెట్టాల్సిన బాధ్య‌త పోలీసుల‌పై ఉంద‌ని.. ప్ర‌భుత్వానికి త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇవ‌న్నీ ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. పోలీసుల‌కు-అధికార పార్టీ నాయ‌కుల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధాలు పెరిగిపోతున్నాయ‌ని.. త‌ద్వారా.. ప్ర‌జ‌ల‌కు స‌రైన న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని కొన్నాళ్లుగా వాద‌న ఉంది. ఇక‌, తాజాగా వెలుగు చూసిన ఓ ఘ‌ట‌న దీనిని మ‌రింత న‌మ్మేలా చేస్తోంది. పోలీసులు తాము చెప్పిన‌ట్టు వినాల‌ని నేత‌లు ప‌ట్టుబడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి.

కోదాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌... పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ``ఎమ్మెల్యేగా చెప్పిన వ్యక్తే ఎస్సైగా ఉంటాడు. మాట విన‌కుంటే తట్టా, బుట్టా సర్దుకుని పోతాడు`` అని.. మల్లయ్య యాదవ్ చేసిన కామెంట్ సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు... ``అధికారమే మా చేతిలో ఉంది. ఎంపీడీఓ అయినా, తాసీల్దార్‌ అయినా.. ఎమ్మెల్యేకు నచ్చినవారే వస్తారు`` అని హెచ్చ‌రిక చేస్తున్న వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్య‌లు కొన్నాళ్ల కింద‌ట చేసిన‌వే అయిన‌ప్ప‌టికీ.. తాజాగా, ఈ వీడియో బయటకు రావడంతో... ఎమ్మెల్యే పై రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు స‌హా సాధార‌ణ ప్ర‌జానీకం కూడా మండిప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. అధికార పార్టీ నేత‌ల దూకుడు త‌గ్గాల‌నేది సాధార‌ణ ప్ర‌జ‌ల‌సూచ‌న. మ‌రి ఏం చేస్తారో చూడాలి.



Tags:    

Similar News