ఎల‌న్ మ‌స్క్‌కు ఇండియా నుంచి మ‌ళ్లీ షాక్‌

Update: 2022-02-05 12:30 GMT
ప్రపంచ కుబేరుల్లో ఒక‌రైన ఎల‌న్ మ‌స్క్‌కు భార‌త ప్ర‌భుత్వం మ‌రోసారి షాకిచ్చింది. టెస్లా, స్పెస్ ఎక్స్ సీఈవో అయిన ఎల‌న్ మ‌స్క్ త‌న వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్త‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టెస్లా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను భార‌త్‌లో ప్ర‌వేశపెట్టాల‌ని  ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. ఆ కార్ల‌ను అమెరికాలో త‌యారు చేసి భార‌త్‌కు దిగుమ‌తి చేయాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. కానీ భార‌త్‌లో దిగుమ‌తి చేసుకునే కార్ల‌పై సుంకాల విష‌యంలో మాత్రం ఆయ‌న అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా దిగుమ‌తి చేసుకునే కార్ల‌పై సుంకాలు త‌గ్గించుకోవాల‌ని ఎల‌న్ మ‌స్క్ భార‌త ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ దీనికి కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం అంగీక‌రించ‌డం లేదు. ఇత‌ర కంపెనీల‌కు ఇవ్వ‌ని ప్రాధాన్యం టెస్లాకు మాత్ర‌మే ఇవ్వ‌డం సమంజ‌సం కాద‌ని భార‌త ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇప్ప‌టికే పాక్షికంగా త‌యారు చేసిన వాహ‌నాల‌ను ఇక్క‌డికి తీసుకువ‌చ్చి అసెంబ్లింగ్ చేస్తే వాటిపై త‌క్కువ ప‌న్నులే విధిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. మేకిన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అసెంబ్లింగ్ త‌యారీ చేసే సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తోంది.

భార‌త్‌లో బిజినెస్ చేయాలంటే అనేక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయ‌ని గ‌తంలో ఎల‌న్ మ‌స్క్ ఓ  సంద‌ర్భంలో వ్యాఖ్యానించారు. మ‌రోవైపు ఆయ‌న మ‌రో కంపెనీ స్పేస్ఎక్స్ నుంచి శాటిలైట్ సంబంధిత స్టార్‌లింక్ ఇంట‌ర్నెట్ సేవ‌లు అందిస్తున్నారు. దీన్ని ఆసియాకు విస్త‌రించేందుకు భార‌త్ అయితే ఉత్త‌మ‌మ‌ని కంపెనీ భావించి ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింది. సేవ‌లం కంటే ముందు బుకింగ్స్ సైతం ప్రారంభించింది. కానీ లైసెన్స్ లేకుండా కార్య‌క‌లాపాలు చేయ‌కూడ‌ద‌నే నిబంధ‌న‌తో కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో క‌నెక్ష‌న్‌ల కోసం తీసుకున్న డ‌బ్బుల‌ను స్టార్‌లింక్ వెన‌క్కి ఇచ్చేసింది. మ‌రోవైపు ఇండియాలోనే త‌మ రాష్ట్రాల్లో పెట్టుబ‌డులు పెట్టాలంటూ ఎల‌న్ మ‌స్క్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో స‌హా పంజాబ్‌, మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌, బెంగాల్ మంత్రులు ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News