దేవుడా.. చంద్రబాబుకు మళ్లీ మరో పరీక్షా?

Update: 2021-03-29 01:30 GMT
ఒక్కోసారి అంతే.. కాలం అస్సలు కలిసి రాదు. ఏం చేయాలనుకున్నా.. మరేదో జరిగిపోతూ ఉంటుంది. ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. పంచాయితీ.. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఎంత కష్టపడ్డా సానుకూల ఫలితం రాలేదు. నిజానికి టీడీపీ నేతల కంటే కూడా కిందిస్థాయి నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నించినప్పటికి.. వారి బలం సరిపోలేదు. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారపక్షంపై పైచేయి సాధించే అవకాశం లేని పరిస్థితి.

పురపోరులో ఎదురైన ఇబ్బందికర ఫలితాల నుంచి బయటకు వచ్చే లోపు.. తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధం కావటం.. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ మొదలు కావటం తెలిసిందే. ఈ ఎన్నికలో అధికార వైసీపీకి.. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థికి మధ్యనే పోరు మొత్తం సాగుతుందని చెబుతున్నారు. టీడీపీకి అవకాశం పెద్దగా లేదన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం కడపజిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే వెంటక సుబ్బయ్య కన్నుమూయటం తెలిసిందే. ఈ ఉదంతం చంద్రబాబుకు మరో ఇబ్బందికర పరిస్థితిని తీసుకురానుందని చెప్పక తప్పుదు. ఏదైనా.. అసెంబ్లీ.. లోక్ సభ స్థానానికి ఖాళీ అయితే.. ఆర్నెల్ల లోపు దానిని భర్తీ చేయాల్సి ఉంటుంది.

అంటే.. ఇప్పటి నుంచి ఆర్నెల్ల లోపు మరో ఉప ఎన్నికకు ఏపీలో అవకాశం ఉందన్నట్లే. రాష్ట్రంలో మిగిలిన చోట్ల సంగతి ఎలా ఉన్నా.. కడప జిల్లా.. అందునా బద్వేల్ అంటే అక్కడ వార్ వన్ సైడ్ అన్నట్లు సాగుతుంది. ఇప్పటికే వరుస ఎన్నికల్లో వస్తున్న అపజయాలతో నీరసించిన విపక్ష పార్టీకి.. వెంకట సుబ్బయ్య కారణంగా వచ్చే ఉప ఎన్నిక బాబుకు పెద్ద పరీక్షగా మారుతుందని చెప్పక తప్పదు. గెలుపు.. కొండంత బలాన్ని తెచ్చిపెడితే.. ఓటమి.. అంతులేని నిరాశలోకి నెట్టేస్తుంది. తాజాగా తెలుగుతమ్ముళ్ల పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News