సండ్ర‌కు ఊస్టింగ్!... అస‌లేం జ‌రుగుతోంది!

Update: 2019-02-15 11:45 GMT
తెలంగాణ‌లో మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో సండ్ర వెంక‌ట‌వీర‌య్య ఒక‌రు. టీడీపీకి వీర విధేయుడిగా ఉన్న సండ్ర‌... ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత టీ టీడీపీకి చెందిన నేతలంతా ఒక్కొక్క‌రుగా పార్టీని వీడినా ... సండ్ర మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. అంతేనా... పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు తెర వెనుక నెర‌పుతున్న వ్య‌వ‌హారాల్లోనూ సండ్ర కీల‌క పాత్రే పోషిస్తున్నారు. చంద్రబాబును అడ్డంగా బుక్ చేసిన కేసులో సండ్ర కూడా ఓ నిందితుడిగా తేల‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పుకోవాలి. త‌న మాటే వేదంగా సాగుతున్న కార‌ణంగానే సండ్ర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవస్థాం (టీటీడీ) పాల‌క మండ‌లిలో స‌భ్యుడిగా చంద్ర‌బాబు అవ‌కాశం క‌ల్పించారు. ఇదేదో ఒక సారి మాత్ర‌మే సండ్ర‌కు టీటీడీ అవ‌కాశం ద‌క్క‌లేదు. వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు ఆయ‌న ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్నారు.

అయితే ఊహించ‌ని విధంగా ఈ రోజు ఆయ‌న‌ను టీటీడీ పాల‌క మండ‌లి నుంచి త‌ప్పిస్తూ ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏమాత్రం ముంద‌స్తు నోటీసులు గానీ, స‌మాచారం గానీ లేకుండానే సండ్ర‌ను ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తూ బాబు సర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక అస‌లు కార‌ణం ఏమై ఉంటుంద‌న్న కోణంలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. టీడీపీకి అప‌ర భ‌క్తుడిగా ఉన్న సండ్ర‌... ఇప్పుడు టీఆర్ ఎస్ వైపు చూస్తున్నార‌ట‌. మొన్న‌టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంద‌ర్భంగా చంద్రబాబు చేసిన ప్ర‌చారంపై టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ ఆగ్ర‌హం ఎంత‌గా ఉందంటే... ఏకంగా ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఓడించేందుకు అవ‌స‌ర‌మైతే... ఏకంగా జ‌గ‌న్‌ కు స‌హ‌కారం అందించేంత‌గా. ఈ క్ర‌మంలో అస‌లు తెలంగాణ‌లో టీడీపీకి ఉనికే లేకుండా చేయాల‌న్న సంక‌ల్పంతో మొన్న‌టి ఎన్నిక‌ల్లో గెలిచిన ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌ను కూడా త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు కేసీఆర్ మంత్రాంగం నెర‌పుతున్నారు.

ఈ క్ర‌మంలో సండ్ర‌తో పాటు మ‌రో ఎమ్మెల్యేగా ఉన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌ర‌రావుతోనూ టీఆర్ ఎస్ శ్రేణులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయ‌ని, వారిద్ద‌రూ ఒకానొక ద‌శ‌లో టీఆర్ ఎస్‌ లో చేరేందుకు సరేన‌న్నార‌ని కూడా వార్త‌లు వినిపించాయి. అయితే మెచ్చా మాత్రం చంద్ర‌బాబును క‌లిసి తాను పార్టీని వీడ‌టం లేద‌ని తేల్చి చెప్పారు. అయితే సండ్ర మాత్రం ఇప్ప‌టిదాకా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు రాలేదు. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్‌ లో చేరేందుకే సండ్ర నిర్ణ‌యించుకున్నార‌న్న వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ మారుతున్న నేతను తాము ఇంకా ప‌దవిలో ఎందుకు కొన‌సాగించాల‌నుకున్నారో, ఏమో తెలియ‌దు గానీ... ఇప్పుడు సండ్ర‌ను ఉన్న‌ప‌ళంగా టీటీడీ బోర్డు స‌భ్యుడి ప‌ద‌వి నుంచి త‌ప్పించేశారు. బోర్డులో స‌భ్యుడిగా ఎంపికైన నేత‌... 30 రోజుల్లోగా ప‌ద‌వీ ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే 30 రోజులు దాటిపోయినా... ప్ర‌మాణానికి సండ్ర రాలేద‌ట‌. ఈ కార‌ణాన్నే చూపుతూనే ఏపీ రెవెన్యూ శాఖ ఆయ‌న‌ను బోర్డు నుంచి త‌ప్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. అయితే సండ్ర ఊస్టింగ్‌కు ఇది కార‌ణం కాద‌ని, టీఆర్ ఎస్‌ కు ఆయ‌న ద‌గ్గ‌ర‌య్యార‌న్న విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కే బాబు స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.


Tags:    

Similar News