పేకాట‌.. బాల‌కృష్ణ పీఏపై జ‌గ‌న్ స‌ర్కారు వేటు!

Update: 2022-04-05 03:56 GMT
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్‌పై జ‌గ‌న్ ప్రభుత్వం వేటు వేసింది. పేకాట ఆడుతూ క‌ర్ణాట‌క పోలీసుల‌కు దొరికిపోయిన ఆయ‌న‌ను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించింది. డిప్యూటేష‌న్ ర‌ద్దు చేస్తూ తిరిగి త‌న మాతృశాఖ‌కు బ‌దిలీ చేసింది. ఈ మేర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. త‌న పీఏ బాలాజీ పేకాటా ఆడుతూ దొరికినా బాల‌య్య స్పందించ‌లేదు. ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. కానీ ప్ర‌భుత్వం మాత్రం అత‌ణ్ని త‌ప్పించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క‌ర్ణాట‌క స‌రిహద్దులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పేకాట ఆడుతూ ఇటీవ‌ల బాలాజీ ప‌ట్టుబ‌డ్డారు. స్థానిక వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ఆయ‌న ప‌క్క రాష్ట్రం వెళ్లి మ‌రీ పేకాట ఆడుతుండ‌డం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ బార్ అండ్ రెస్టారెంట్‌పై దాడి చేసిన అక్క‌డి పోలీసులు వీళ్ల‌ను అరెస్టు చేశారు. కానీ ఆ త‌ర్వాత బాలాజీ బెయిల్‌పై విడుద‌ల‌య్యారు. బాలాజీ ఓ ఉపాధ్యాయుడు.

కానీ ఆ త‌ర్వాత బాల‌కృష్ణ ద‌గ్గ‌ర పీఏగా చేరారు. చాలా రోజుల నుంచి హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌వ‌హారాల‌న్నీ ఆయ‌నే చ‌క్క‌బెడుతున్నారు. బాల‌కృష్ణ హైద‌రాబాద్‌లోనే ఉండ‌డంతో ఎమ్మెల్యే ప్ర‌తినిధిగా బాలాజీ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇప్పుడు పేకాట ఆడుతూ పోలీసుల‌కు బాలాజీ దొర‌క‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ సంఘ‌ట‌పై బాల‌య్య స్పందించ‌లేదు. బాలాజీ కూడా యాథావిథిగా త‌న ప‌నులు చేసుకుంటూ సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం మాత్రం ఆయ‌న్ని బాల‌కృష్ణ పీఏగా కొన‌సాగించేందుకు మాత్రం సమ్మ‌తించ‌లేదు. ఆయ‌న‌పై వేటు వేసింది. డిప్యూటేష‌న్ ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఇక‌పై ఆయ‌న మ‌ళ్లీ టీచ‌ర్‌గా విధులు నిర్వ‌ర్తించాల్సి ఉంటుంది. మ‌రి ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై బాల‌కృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి. పేకాట ఆడుతూ దొరికాడు కాబ‌ట్టి పీఏనే వ‌దులుకుంటారా? లేదా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తారా? అన్న‌ది ఆస‌క్తి రేపుతోంది.
Tags:    

Similar News