టీడీపీ తికమక ఫార్ములా.. శ్వేతపత్రంలో మెలిక

Update: 2018-02-16 17:36 GMT
చంద్రబాబు ఏం చేసినా వెరైటీయే. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది... అందులో దేనికెంత ఖర్చు చేశారో చెప్పాలంటూ జనసేన సహా వివిధ రాజకీయ పక్షాలు అడుగుతుండడం..తాము భారీగా నిధులిచ్చామంటూ బీజేపీ లెక్కలు విడుదల చేయడంతో రాష్ర్టం కూడా లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే... కేంద్రం ఇచ్చిన లెక్క తప్పని చెప్పడానికి... ఏమీ ఇవ్వలేదు అనడానికి బలమైన ఆధారాలు లేకపోవడంతోనే చంద్రబాబు ప్రభుత్వం లెక్కల విడుదలను నాన్చుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే... దీనికి పరిష్కారంగా చంద్రబాబు తికమక ఫార్ములా ఒకటి కనిపెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారట. అయితే.. కేంద్రం ఇచ్చిన నిధులపై మొత్తంగా ఒకే లెక్క కాకుండా వివిధ శాఖలు - రంగాల వారీగా నాలుగైదు శ్వేతపత్రాలు విడుదల చేసి కన్ఫ్యూజ్ చేసే యోచనలో ఉణ్నట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా చేసిన ప్రకటన కూడా అందుకు ఊతమిస్తోంది.
    
ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన నిధులపై త్వరలో 4 - 5 శ్వేతపత్రాలు ఇచ్చే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని గంటా అంటున్నారు. తామేమీ అదనంగా కోరడంలేదని - పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని గంటా అన్నారు. కేంద్రమిచ్చిన నిధులపై బీజేపీ నేతలతో ఎక్కడయినా - ఎప్పుడయినా చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.
    
ఏపీ బీజేపీ అధ్యక్షుడు - ఎంపీ హరిబాబు ఢిల్లీలో తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గతంలో తాను ప్రకటించిన వివరాలనే మళ్లీ తెలిపారని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తిరుపతి ఎన్నికల బహిరంగ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ - ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీలో నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీకి ప్రధాన మంత్రి కట్టుబడి ఉండాలని మంత్రి కోరారు. హామీల్లో చెప్పిన ఏడు ఇన్‌ స్టిట్యూట్‌ లకు గానూ అయిదు మాత్రమే ప్రారంభమయ్యాయన్నారు. వాటి తరగతులు సొంత భవనాల్లో జరగడంలేదన్నారు. కర్నూలుకు కేటాయించిన IIIT తరగతులు తమిళనాడులోని కాంచీపురంలో నిర్వహిస్తున్నారన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం - సెంట్రల్ యూనివర్శిటీకి ఇంత వరకూ కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపలేదన్నారు. ఏడు ఇన్‌ స్టిట్యూట్‌ లకు 2015-16లో రూ.103 కోట్లు - 2016-17లో రూ.158 కోట్లు - 17-18లో రూ.260 కోట్లు - 18-19 బడ్జెట్ లో రూ.245 కోట్లు మాత్రమే కేటాయించారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు విలువ చేసే 2,401 ఎకరాలు కేటాయించిందన్నారు. ఏపీకి ఎయిర్ పోర్టు - దూరదర్శన్ - పాస్ పోర్టు కేంద్రాలు ఇచ్చినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. ఏ రాష్ట్రానికయినా దూరదర్శన్ - పాస్ పోర్టు కార్యాయాలు మంజూరు చేయడం సాధారణ విషయమన్నారు.


Tags:    

Similar News