అ అంటే అప్పులు... ఆ అంటే ఆంధ్రా...ఏటా లక్షల కోట్ల కొత్త రుణాలు

Update: 2022-12-03 06:28 GMT
ఆంధ్రా అప్పులతో కునారిల్లుతోంది. అప్పు చేసి పప్పు కూడు కాదు పాడూ కాదు, ఏమవుతుందో లెక్కా జమా లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అప్పులు ఏ ఏటికి ఆ ఏడు కొండవీటి చాంతాడు మాదిరిగా పెరిగిపోతున్నాయి. వాటి మీద మళ్లీ కొత్త అప్పులు ఇలా చూసుకుంటే ప్రస్తుత ఆర్ధిక సంవత్సవ్రం ముగిసే నాటికే ఏకంగా లక్ష కోట్ల అప్పులు చేసే అవకాశం ఉందని అంచనా కడుతున్నారు.

ఏపీలో అప్పుల మీద సరైన గణాంకాలు వివరాలు కాగ్ అడిగినా ఇవ్వడంలేదు అన్నది ఒక ప్రధాన ఆరోపణ.  అలాగే కేంద్ర ఆర్ధిక శాఖ కూడా అప్పుల మీద మోనిటరింగ్ చేయడానికి ఎంత అప్పులు ఉన్నాయని ఎప్పటికపుడు లెక్కలు అడుగుతోంది. అయినా పూర్తి వివరాలు బయటపడడంలేదు అని అంటున్నారు. అప్పులు ఎంతలా చేస్తున్నారు అంటే బడ్జెట్ లో చెప్పినది ఒకటి అయితే బయట చేసేది మరోటి అన్నట్లుగా కధ సాగుతోంది అంటున్నారు.

ఇక 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 48,724 కోట్ల రుణాలకే ఉపయోగించుకుంటామని చెప్పి చట్ట సభల ఆమోదం పొందాక ఇపుడు తొలి ఆరు నెలల్లోనే చేసిన అప్పు చూస్తే 49,278 కోట్ల రూపాయల రుణాలను సేకరించారని తెలుస్తోంది. దాని మీద మరో రెండు నెలలు గడచాయి. వాటిని కూడా కలుపుకుంటే ఇంకో పది వేల కోట్ల రూపాయలు అప్పులు పెరిగాయని అని అంటున్నారు.

ఇక బ్రేవరేజ్ కార్పోరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు 8,300 కోట్ల రూపాయలు వీటికి జమ చేసి చూడాలి, అలాగే ఇతర కార్పోరేషన్ల ద్వారా మరో పది వేల కోట్ల రూపాయలు రుణాన్ని తెచ్చిన దాన్ని కలుపుకుంటే టోటల్ గా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటిదాకా 67,578  కోట్ల  రూపాయలు అప్పులు తెచ్చినట్లుగా స్పష్టం అవుతోంది అని అంటున్నారు.

ఇంకా నాలుగు నెలల కాలం ఉంది. అంటే ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష కోట్ల అప్పులు దాటే సీన్ ఉంది అని అంటున్నారు. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ మూడున్నరేళ్లలో అప్పుల భారం చూస్తే ఏకంగా 8 లక్షల 71 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. కాదేదీ అప్పునకు అనర్హం అని అన్నింటి మీద అప్పులు చేస్తున్నారని అంటున్నారు. ఇక వాటి మీద వడ్డీలు, మళ్లీ అప్పులు ఇలా ఒక విష వలయంలో చిక్కుకుని ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిపోతోంది అన్న ఆందోళన ఎక్కువ అవుతోంది.

ఈ అప్పులు ఎన్ని చేసినా కూడా ఉద్యోగులకు సకాలంలో ఫస్ట్ నాటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రిటైర్డ్ అయిన వారికి పించనర్లకు పెన్షన్ పడడం లేదు, అలాగే కాంట్రాక్టర్లకు తాము చేసిన పనులకు బిల్లుల చెల్లింపు లేదు, ప్రాజెక్ట్ నిర్మాణం పనులు చేసినా డబ్బులు ఇస్తారన్న నమ్మకం లేదు, దీంతో కొత్తగా టెండర్లు దాఖలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది అంటున్నారు.

మరో వైపు చూస్తే ఉద్యోగులు తాము దాచుకున్న సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరుతున్నా ఇవ్వలేని దుస్థితి ఉంది. కరవు భత్యం బకాయిలు పేరుకుపోయాయి, వాటిని చెల్లించడంలేదు, దీంతో చాలా మంది తమ డబ్బుల కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. అక్కడ కూడా ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితి. దాంతో మధ్యలో పడి  కోర్టు ధిక్కార కేసుకు ఎదుర్కొంటున్నారు. నిజంగా ఇందంతా చూస్తూంటే ఆందోళన కలిగించే వ్యవహారమే అని అంటున్నారు.

అప్పులు చేయడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎన్ని వేల కోట్లు అప్పులు చేశారో వివరాలు కావాలని కాగ్ అడుగుతున్నా ఇవ్వడంలేదని అంటున్నారు. అదే విధంగా చూస్తే మూడున్నరేళ్ళుగా పేరుకుపోయిన అప్పులకు కొత్త అప్పులు చేరుతూంటే ఈ రాష్ట్రం ఎటు పోతోంది అన్న చర్చ అయితే వస్తోంది.

ఇవన్నీ కూడా ఒక అంచనగా తీసుకుంటే ప్రజా రుణాలు 4 లక్షల 62 వేల, 278 కోట్లు ఉంటే, వివిధ కార్పోరేషన్ల ద్వారా ఒక లక్షా 71 వేల  903 కోట్ల రూపాయలు,  నాన్ గ్యారంటీ రుణాలు 87 వేల 233 కోట్ల రూపాయలు, వీటితో పాటు పెండింగ్ బిల్లుల అంచనా లక్షా యాభై వేల కోట్ల రూపాయలుగా ఉందిట. దీంతో మొత్తం 8 లక్షల 71 వెల కోట్లుగా 414 కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. ఇంత అప్పును చూసినపుడు అమ్మో  ఆంధ్రా అనిపించకమానదు. మరి ఈ అప్పుల లెక్కకు ఎవరు బాధ్యులు అన్న ప్రశ్న అడవవద్దు. ఎవరు భరాయించాలి అన్నది మాత్రం అంతా ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News