మడమ తిప్పనని చెప్పే జగన్ ఈ మాటలకేంటి సమాధానం?

Update: 2022-08-02 14:30 GMT
మాట తప్పం.. మడమ తిప్పం.. తమ కుటుంబం గురించి గొప్పగా చెప్పుకుంటారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాను మాట ఇస్తే అంతేనని.. శిలాశాసనం లెక్క అన్నట్లుగా ఆయన తియ్యటి కబుర్లు చెబుతుంటారు. మరి.. ఆయన చెప్పే మాటలకు.. తీసుకునే నిర్ణయాలకు ఏ మాత్రం సంబంధం లేదంటూ రెండు.. మూడు రోజులుగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి కారణం..మద్య నిషేధంపై జగన్ కోసిన కోతలే అని చెప్పాలి. మారిన కాలానికి తగ్గట్లు.. మారిన పరిస్థితుల్లో మద్య నిషేధాన్ని అమలు చేసే దమ్ము.. ధైర్యం ఉన్న ప్రభుత్వాలు లేవనే చెప్పాలి.

ప్రభుత్వ ఖజానాకు వచ్చేఆదాయంలో అధిక భాగంగా ఎక్సైజ్ శాఖ నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. మద్యం అమ్మకాల్ని మరింత పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. విపక్ష నేతగా ఉన్న వేళలో.. మద్యనిషేధం గురించి మాటలు చెప్పిన జగన్.. గడిచిన రెండు రోజులుగా మూడేళ్ల పరిమిత కాలం అమలయ్యేలా బార్ లైసెన్సుల్ని వేలం వేయటం తెలిసిందే. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానన్న జగన్.. ఇంత భారీగా బార్ లైసెన్సుల్ని ఎందుకు జారీ చేస్తున్నట్లు? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. మాట తప్పని.. మడమ తిప్పని వంశంగా గొప్పలు చెప్పుకునే జగన్.. ఇకపై ఆ మాట అనే అవకాశమే లేదంటున్నారు. ఎందుకుంటే.. బార్ లైసెన్సుల వేలంతో మూడేళ్ల పాటు భారీ ఎత్తున ఆదాయానికి తెర తీసిన నేపథ్యంలో దశల వారీ మద్య నిషేధానికి మంగళం పాడినట్లేనని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మద్య నిషేధంపై విపక్ష నేతగా ఉన్న వేళ.. జగన్ నోటి నుంచి  వచ్చిన కీలక వ్యాఖ్యల్ని ప్రస్తావించి మరీ జగన్ ను తప్పుపడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు చేస్తానని చెబుతూ.. 2015 డిసెంబరు 8న విలేకరుల సమావేశంలో ఆయనేం చెప్పారో పలువురు గుర్తు చేస్తున్నారు.

నాడు విపక్ష నేత హోదాలో జగన్ ఏం మాట్లాడారన్నది చూస్తే.. ''చంద్రబాబు మద్యాన్ని నిషేధిస్తారో లేదో నాకు తెలీదు. ఆయన ప్రభుత్వం దిగిపోతుంది. రెండేళ్లకో.. మూడేళ్లకో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం. డబ్బులున్నవాడో.. సూటుబూటు వేసుకున్నవాడో ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళ్లి తాగితే ఫర్లేదు. కానీ.. ఇంత విచ్చలవిడిగా ప్రజలతో మద్యం తాగిస్తారా? దీని వల్ల పిల్లల చదువులూ దారి తప్పుతాయి. ఐదు నక్షత్రాల హోటళ్లుమినహా మరెక్కడా మద్యం లభించకుండా చేస్తాం'' అని పేర్కొన్నారు.

అక్కడితో ఆగని ఆయన 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నిషేధం మీద ఏమని పేర్కొన్నది చూస్తే.. ''కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే మేం అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. తర్వాత కేవలం 5నక్షత్రాల హోటళ్లలోనే మద్యం దొరికేలా చేస్తాం'' అని పేర్కొన్నారు.

ఈ రెండింటి కంటే హైలెట్ ఏమంటే.. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీలో పెట్టిన తొలి ప్రెస్ మీట్ లో దశల వారీ మద్య నిషేదం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ''మద్యంపై వచ్చే ఆదాయాన్ని ఒకేసారి పూర్తిగా తీసేయలేం. అందుకే దశల వారీ మద్యనిషేధాన్ని అమలు చేస్తాం. దానిపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుపోతాం. 2024 ఎన్నికల నాటికి కేవలం ఐదునక్షత్రాల హోటళ్లకే మద్యాన్ని పరిమితం చేస్తాం. తర్వాత ఓట్లు అడుగుతాం'' అంటూ నీతులు చెప్పిన జగన్.. ఇప్పుడు ఏకంగా 838 బార్లకు మూడేళ్ల కాల పరిమితితో బార్ లైసెన్సుల్ని ఎలా జారీ చేశారన్నది అసలు ప్రశ్నగా మారింది. మరి.. మాట తప్పని జగన్.. ఈ మూడు మాటలకు ఏమని బదులిస్తారు?
Tags:    

Similar News