బస్సులు రాకుండా చేశారు.. ఇప్పుడు తోరణాలు.. ఫ్లెక్సీల మీద పడ్డారట

Update: 2022-05-26 08:30 GMT
తాము అధికారంలో ఉన్నాలేకున్నా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని మహానాడుగా భారీగా నిర్వహించటం తెలుగుదేశం పార్టీకి మొదట్నించి అలవాటు. మరే జాతీయపార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ ఇంత ఆడంబరంగా.. వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించే దాఖలాలు కనిపించవు. అంతేకాదు.. మహానాడు సందర్భంగా పార్టీకిచెందిన అగ్రనేతలు.. కీలక నేతలు మాత్రమే కాదు.. కార్యకర్తల్ని సైతం ఆహ్వానించి.. వారిని సైతం మహానాడులో భాగస్వామ్యం చేయటం టీడీపీకి అలవాటుగా చెప్పాలి.

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. అడుగడుగునా అవాంతరాలు.. ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని ఎదుర్కొంటూ రెట్టించిన ఉత్సాహంతో మహానాడును భారీ సక్సెస్ చేయాలని ప్రయత్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

ఇదిలా ఉంటే.. మహానాడుకు వచ్చేందుకు వీలుగా ఎప్పటిలానే స్కూల్ బస్సుల్ని.. ప్రైవేటు ట్రావెల్స్ ను సంప్రదించగా వారు చేతులు ఎత్తేశారు. లోగుట్టుగా ఏపీ అధికారాపక్షం నుంచి ట్రావెల్ యజమానులకు.. స్కూల్ యాజమాన్యాలకు బస్సులు మహానాడుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదన్న లోగుట్టు ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.

ఇదిలాఉంటే.. ఇప్పుడు మరో తలనొప్పి మొదలైందంటున్నారు. ఈసారి మహానాడును ప్రకాశం జిల్లా  మండువవారి పాలెంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఒంగోలు పట్టణానికి సమీపంలో ఉండే నేపథ్యంలో.. ఒంగోలు పట్టణాన్ని పసుపు తోరణాలు.. జెండాలు.. ఫ్లెక్సీలతో అందంగా ముస్తాబు చేశారు. మరో రోజులో మొదలయ్యే మహానాడు వేడుకలు రెండు రోజుల(మే 27, 28) పాటు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన అన్ని అనుమతుల్ని అధికారుల నుంచి తీసుకున్నారు. అయినప్పటికీ..అధికారులు మాత్రం అడుగడుగునా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు చెబుతున్నారు.

తాజాగా ఫ్లెక్సీలు.. జెండాలు.. పసుపు తోరణాలు కట్టేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదంటూ తొలగిస్తున్న వైనంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధికారులపై ఫైర్ అవుతున్నారు. తానే స్వయంగా వచ్చి ఫ్లెక్సీలు.. జెండాలు కడతానని.. ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ మండిపడుతున్నారు.

ఎంతఅధికారంలో ఉంటే మాత్రం మరీ ఇంతలా వేధింపులకు గురి చేయటమా? అని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం శాశ్వితం కాదని.. ఇవాళ వైసీపీ ఉన్నా.. భవిష్యత్తులో ఆ పార్టీ సైతం విపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందని.. ఆ రోజున ఇప్పుడు చేసిన దానికి వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీకి సైతం లక్ష్మణ రేఖ ఉంటుందని.. దాన్ని దాటటం సరికాదంటున్నారు.
Tags:    

Similar News