2024లో వైసీపీలో జంప్ బ్యాచ్‌కు సీట్లు లేవా?

Update: 2022-02-07 11:30 GMT
2019  ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ తొలిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు. అప్పుడే ఆయ‌న ప్ర‌భుత్వంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా రెండున్న‌రేళ్ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీంతో ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల సంద‌డి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీలోని కొంత‌మంది ఎమ్మెల్యేల్లో కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్కుతుందో లేదోన‌నే అనుమానంలో ఉన్నారు.  2019 ఎన్నిక‌ల‌కు ముందు..  వైసీపీ గెలిచాక ఆ పార్టీలో చేరిన నేత‌లకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ క‌ష్ట‌మేన‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌లకు ముందు.. ఆ త‌ర్వాత టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ ఎత్తున చేరిక‌లు జ‌రిగాయి. చాలా మంది నేత‌లు జంప్ అయ్యారు. కానీ వాళ్ల‌కు ఈ సారి వైసీపీ త‌ర‌పున టికెట్ ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని రాజకీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చీరాల నుంచి టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం ఆ త‌ర్వాత వైసీపీలో చేరారు. సీనియ‌ర్ నేత అయిన బ‌ల‌రాం పార్టీ వీడ‌డంతో అక్క‌డ టీడీపీకి దెబ్బ ప‌డింది. కానీ ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ బీసీ అభ్య‌ర్థిని బ‌రిలో దించాల‌ని వైసీపీ భావిస్తోంది. అక్క‌డ బీసీల బ‌లం గ‌ణ‌నీయంగా ఉంద‌ని ఆ పార్టీ అనుకుంటోంది. దీంతో బ‌ల‌రామ్‌ను ప‌క్క‌న‌పెట్ట‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం.

మ‌రోవైపు కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నుంచి టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచిన వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆ త‌ర్వాత వైసీపీ మ‌ద్ద‌తుదారుడిగా మారిపోయారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ నుంచి పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మైంద‌నే ప్ర‌చారం సాగింది. కానీ ఇటీవ‌ల టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి భార్యపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌నే కార‌ణంతో వంశీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ఆయ‌న సొంత సామాజిక వ‌ర్గంలో వంశీపై తీవ్ర ఆగ్ర‌హం వెల్ల‌డైంది. దీంతో అక్క‌డ అత‌నికి ఈ సారి సీటు ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని స‌మాచారం.

ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్ల కేటాయింపుల్లో చాలా లెక్క‌ల‌ను వైసీపీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో అయితే జ‌గ‌న్‌ను చూసి ప్ర‌జ‌లు ఓట్లు వేశారు. కానీ ఈ సారి అధికారంలో ఆ పార్టీ నేత‌లు ఉన్నారు. అధికార ప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో వాళ్లు చేసిన అభివృద్ధిని చూసి మాత్ర‌మే ప్ర‌జ‌లు ఓట్లు వేసే అవ‌కాశం ఉంది. న‌వ‌ర‌త్నాల పేరుతో జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. కానీ ఆ క్రెడిట్ మొత్తం ఆయ‌న‌కే వెళ్లే వీలుంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేల‌పై పెద్ద‌గా సానుకూల‌త ఉండదు. అందుకే ఇప్ప‌టినుంచే ప్ర‌జ‌ల్లో తిర‌గ‌క‌పోతే ఇబ్బంది త‌ప్ప‌ద‌ని ఆ ఎమ్మెల్యేలు అనుకుంటున్న‌ట్లు తెలిసింది.
Tags:    

Similar News