కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో ఉంది ఈ ఆరుగురేనా?

Update: 2022-08-25 04:32 GMT
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ప‌ద‌విని స్వీక‌రించ‌డానికి ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తిర‌స్క‌రించిన విష‌యం తెలిసిందే. అలాగే అనారోగ్య కార‌ణాలు, వృద్ధాప్యంతో ప్ర‌స్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ మ‌రోమారు అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి సిద్ధంగా లేరు. ఇక మ‌ధ్యేమార్గంగా ప్రియాంగా గాంధీని ఈ ప‌ద‌విని చేపట్టాల‌ని కోరగా ఆమె కూడా తిర‌స్క‌రించార‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాస‌పాత్రులు, అపార రాజ‌కీయ అనుభ‌వం ఉన్న‌వారిని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి, గుజ‌రాత్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు అశోక్ గెహ్లోత్‌ను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియ‌మించాల‌ని సోనియాగాంధీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు చెబుతున్నారు. అయితే ఆయ‌న రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌టానికే ఇష్ట‌ప‌డుతున్నార‌ని అంటున్నారు.

తాను సీఎం ప‌ద‌వి నుంచి తప్పుకుంటే త‌న ప్ర‌త్య‌ర్థి స‌చిన్ పైల‌ట్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని.. అందువ‌ల్ల అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్ట‌రాద‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు స‌మాచారం. కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌డితే రాజ‌స్థాన్‌లో త‌న ప‌ట్టు జారిపోతుంద‌ని.. ఆయ‌న భ‌య‌ప‌డుతున్నార‌ని అంటున్నారు.

అయితే అశోక్ గెహ్లోత్ అయితే పాత, కొత్తతరం నేతలను క‌లుపుకుపోగ‌ల‌ర‌ని సోనియా గాంధీ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను ఇప్ప‌టికే ఢిల్లీ పిలిపించి సోనియా మాట్లాడారు. పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు స్వీక‌రించాల‌ని కోరారు. కాగా కాంగ్రెస్ అత్యున్న‌త నిర్ణాయ‌క విభాగ‌మైన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశం ఆగ‌స్టు 28న జ‌ర‌గ‌నుంది. పార్టీ అధ్యక్ష ఎన్నిక‌ల తేదీని ఈ స‌మావేశంలో నిర్ణ‌యిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి సిద్ధంగా లేక‌పోతే  అధిష్ఠానానికి విధేయులుగా ఉన్న సీనియర్‌ నేతలు.. అంబికా సోనీ, మల్లికార్జున్‌ ఖర్గే,  మీరాకుమార్‌, కేసీ వేణుగోపాల్‌, ముకుల్‌ వాస్నిక్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఉండేది.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల‌కు అత్యంత విశ్వాస‌పాత్రులేన‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌ల‌ను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసింది. జీ-23 నేత‌ల ఒత్తిడితో సెప్టెంబ‌ర్ 20లోపు పార్టీ అధ్యక్ష ప‌ద‌వికి ఎన్నిక జ‌ర‌పాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. ఒక‌వేళ ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఎన్నిక జ‌ర‌ప‌క‌పోతే కొన్నాళ్లు సోనియాగాంధీనే అధ్యక్ష ప‌ద‌విలో ఉంటార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News