తెలుగు నేల‌కు... జైట్లీ కేటాయింపులివే!

Update: 2018-02-01 10:49 GMT
2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి న‌రేంద్ర మోదీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ నిజంగానే ప‌లు రంగాల‌కు భారీగానే షాకిచ్చింద‌నే చెప్పాలి. గ్రామ సీమ‌లు - రైతుల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగిన ఈ బ‌డ్జెట్‌... ఇత‌ర రంగాల‌కు భారీగానే షాకిచ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇత‌ర రంగాల మాటెలా ఉన్నా.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో న‌రేంద్ర మోదీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టనున్న ఈ చివ‌రి బ‌డ్జెట్‌పై చాలా తెలుగు నేల చాలా ఆశలే పెట్టుకున్నాయి. ఎందుకంటే గ‌డ‌చిన బ‌డ్జెట్‌ ల‌లో మోదీ స‌ర్కారు తెలుగు నేల‌కు పెద్ద‌గా చేసిందేమీ లేద‌నే చెప్పాలి. అయితే నేటి ఉద‌యం రానున్న‌ది ఎన్నిక‌ల బ‌డ్జెట్ అని, అందులో తెలుగు నేల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు మోదీ స‌ర్కారు త‌ప్ప‌నిస‌రిగా య‌త్నిస్తుంద‌ని, ఫ‌లితంగా గ‌డ‌చిన బ‌డ్జెట్‌ ల‌లో న్యాయం జ‌ర‌గ‌కున్నా... ఈ బ‌డ్జెట్‌ లో మాత్రం న్యాయం జ‌రిగి తీరుతుంద‌ని ఏపీ ప్ర‌జ‌లు భావించారు.

అయితే తెలుగు ప్ర‌జ‌ల‌ను ఆశ‌ల‌ను గ‌ల్లంతు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలుగు రాష్ట్రాల‌కు చాలా త‌క్కువ కేటాయింపులే చేశారు. చేసిన కేటాయింపులు కూడా నిధుల ప‌రిమాణంలో చాలా త‌క్కువ‌గా ఉండ‌టంతో తెలుగు ప్ర‌జ‌లు తీవ్ర నిరాశ‌కే గుర‌య్యార‌ని చెప్పిర త‌ప్ప‌దు. ఇక బ‌డ్జెట్‌ లో తెలుగు రాష్ట్రాలైన ఏపీ - తెలంగాణ‌ల‌కు కేంద్రం ఏ మేర కేటాయింపులు చేశార‌న్న విష‌యానికి వ‌స్తే..  ఏపీలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ . 10 కోట్లు - గిరిజన వర్సిటీకి రూ. 10 కోట్లు - ఎన్‌ ఐటీకి రూ. 54 కోట్లు - ఐఐటీకి రూ. 50 కోట్లు - ట్రిపుల్‌ ఐటీలకు రూ .30 కోట్లు - ఐఐఎంకు రూ. 42 కోట్లు - ఐఐఎన్‌ సీఆర్‌ కు రూ.49 కోట్లు కేటాయించారు. ఏపీ సెంట్రల్‌ వర్సిటీకి రూ. 10 కోట్లు - నిట్‌ కు రూ. 54 కోట్లు కేటాయించారు. ఇక డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ కు రూ . 19.62 కోట్లు - విశాఖ పోర్టుకు రూ 108 కోట్లు - స్టీల్‌ ప్లాంట్‌ కు రూ . 1400 కోట్లు - ఏపీ ట్రైబల్‌ వర్సిటీకి రూ .10 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇక తెలంగాణలో సింగరేణికి రూ 2 వేల కోట్ల పెట్టుబడులు సమకూర్చనున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

తెలంగాణ ట్రైబల్‌ వర్సిటీకి రూ 10 కోట్లు - ఐఐటీకి రూ 75 కోట్లు - ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీకి రూ 32 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. అస‌లు ఇంత త‌క్కువ‌గా తెలుగు నేల‌కు కేటాయింపులు జ‌రిగిన దాఖ‌లా గ‌తంలోనూ లేద‌నే చెప్పాలి. కొన్ని అంశాల‌కు కేటాయింపులు లేకపోయినా.. కేటాయింపులు ద‌క్కిన వాటికి మాత్రం నిధుల ప‌రిమాణం మాత్రం భారీగానే ఉండేది. అయితే అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన మోదీ స‌ర్కారు తెలుగు నేల‌కు చెందిన ప‌లు అంశాల‌కు కేటాయింపులు చేస్తున్న‌ట్లుగానే క‌నిపించినా... ఆ కేటాయింపుల‌ను అత్యంత త‌క్కువ‌కు కుదించేసి త‌న‌దైన శైలిలో అన్యాయం చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News