లవర్స్ డే నాడు కాదు ప్రమాణస్వీకారం..ముహూర్తం మారింది

Update: 2020-02-12 08:45 GMT
గతంలో ఫిబ్రవరి 14వ తేదీ లవర్స్ డే నాడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారం చేయగా ఈసారి కూడా అదే రోజు చేస్తారని అందరూ భావించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని ప్రచారం సాగింది. కానీ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం 14వ తేదీన కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఫిబ్రవరి 16వ తేదీన ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. తొలుత ఫిబ్రవరి 14న కేజ్రీవాల్‌ సీఎంగా ప్రమాణం స్వీకారం చేయనున్నారని వార్తలు రాగా.. మారిన రాజకీయ పరిస్థితులతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లతో గెలుపొంది కేజ్రీవాల్‌ ఫిబ్రవరి 14వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు మొత్తం 70 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ 62 గెలిచి మూడో సారి అధికారం చేపట్టనుంది. మళ్లీ అదే సమయానికి ఎన్నికలు ముగియడంతో ముహూర్తం అదే భావించారు. కానీ కొన్ని కారణాల రీత్యా ముహూర్తం మార్చారు.

అయితే తన ప్రమాణస్వీకారానికి బీజేపీయేతర పక్షాలను ఆహ్వానించాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రమాణం చేస్తే ఢిల్లీకి రాజకీయ ప్రముఖులు ఎవరూ రాలేరని అనుకున్నారు. దీంతో కొంత సమయం తీసుకుని ప్రమాణస్వీకారం చేస్తే దానికి రాజకీయ ఉద్ధండులు హాజరయ్యే అవకాశం ఉందని భావించి ముహూర్తం వాయిదా వేశారు. తన ప్రమాణ స్వీకారానికి పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో పాటు మరికొందరు ప్రముఖ నాయకులను ఆహ్వానించే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ మార్పు అని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
Tags:    

Similar News