ఒవైసీ ఎంట్రీ!.. కమల్ కు మద్దతు దొరికింది!

Update: 2019-05-14 15:59 GMT
మ‌జ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం).... మ‌నమంతా మ‌జ్లిస్‌ గా పిలుచుకునే పార్టీ. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ ప‌హిల్వాన్‌ గా పేరుగాంచిన ఈ పార్టీ ఒవైపీ ఫ్యామిలీ చేతుల్లోనే పుట్టి... అదే ఫ్యామిలీ చేతుల్లోనే న‌డుస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న అస‌దుద్దీన్ ఒవైసీ ఈ పార్టీకి అధినేత‌గా ఉన్నారు. మ‌జ్లిస్ పార్టీ అంటే... పాత‌బ‌స్తీలోని ముస్లింల‌కు అండ‌గా నిలిచే పార్టీ. ఈ క్ర‌మంలో ఇస్లామిక్ తీవ్ర‌వాదం ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ... ముస్లింల‌కు అండ‌గా నిలుస్తున‌ర్న ఒవైసీ ఫ్యామిలీ హిందూ వ్య‌తిరేకిగా క‌నిపిస్తుంది. ఈ మాట నిజ‌మేన‌న్న‌ట్లుగా అసద్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఆయ‌న మ‌రోమారు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.

మ‌హాత్మా గాంధీని హ‌త్య చేసిన నాథూరామ్ గాడ్సేను ఉగ్ర‌వాదిగా అభివ‌ర్ణించిన ప్ర‌ముఖ సినీ న‌టుడు - మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెద్ద వివాదంగానే మారిపోయింది. క‌మ‌ల్ నోట నుంచి ఈ మాట‌లు రాగానే... దాదాపుగా అన్ని పార్టీల నేత‌లు క‌మ‌ల్ పై విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో అన‌వ‌స‌ర వివాదంలో చిక్కుకున్నార‌న్న వాద‌న కూడా వినిపించింది. అయితే క‌మ‌ల్ వాదన‌ను స‌మ‌ర్థిస్తూ ఒవైసీ పెను క‌ల‌క‌ల‌మే రేపారు. జాతిపితను హతమార్చిన నాథూరామ్‌ గాడ్సే నిజమైన ఉగ్రవాది అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

మహాత్మా గాంధీ హంతకుడిని గొప్పవాడిగా ఎలా అభివర్ణిస్తారని కూడా అస‌ద్ ప్రశ్నించారు. హిందూ ఉగ్రవాదం గురించి నోరెత్తని వారు మహాత్మా గాంధీని చంపింది ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తద్వారా నాథూరామ్‌ గాడ్సే గురించి కమల్‌ వెలిబుచ్చిన అభిప్రాయానికి ఆయన మద్దతుగా నిలిచార‌ని చెప్పాలి. ఈ వివాదంలో ఇప్ప‌టికే కమ‌ల్ మీద అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు రేకెత్తుతుంటే... ఇప్పుడు అస‌ద్ కూడా ఆయ‌న ప‌క్షానే నిల‌బ‌డ‌టంతో అస‌ద్ పై ఇంకెంత విమ‌ర్శలు వ‌స్తాయో చూడాలి.
Tags:    

Similar News