మీ ద‌గ్గ‌రే కాదు మా ద‌గ్గ‌ర అణుబాంబులున్నాయ్!

Update: 2019-03-03 04:47 GMT
దేశంలో చాలామంది మైనార్టీ నేత‌లు ఉన్నా.. మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ తీరు మాత్రం భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తార‌న్న దానిపై ఊహ‌కు అంద‌ని రీతిలో ఆయ‌న రియాక్ట్ అవుతుంటారు. ఆ మ‌ధ్య  వ‌ర‌కూ మైనార్టీ సంక్షేమం.. హైద‌రాబాద్ పాత బ‌స్తీ చుట్టూనే రాజ‌కీయాలు న‌డిపిన ఆయ‌న‌.. గ‌డిచిన కొన్నేళ్లుగా ఆయ‌న వ్యూహంలో మార్పు వ‌చ్చింది. మ‌రీ.. ముఖ్యంగా గ‌డిచిన ఆరు నెల‌ల్లో ఆయ‌న మాట‌ల్లోనూ తేడా మ‌రింత ఎక్కువైంద‌ని చెప్పాలి.

ఆయ‌న జాతీయ అంశాల‌తో పాటు.. అంత‌ర్జాతీయ అంశాల్ని త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడైన ఆయ‌న‌.. ఇటీవ‌ల కాలంలో పాక్ ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంటున్నాయి. అంతేనా.. రాజ‌కీయంగా అస‌ద్ తీరును త‌ప్పు ప‌ట్టే వారు సైతం.. తాజాగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు ఫిదా అవుతున్నారు.

భార‌త్ - పాక్ మ‌ధ్య సాగుతున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప‌లుమార్లు స్పందించిన అస‌ద్‌.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు నేరుగా హెచ్చ‌రిక‌లు చేయ‌టం క‌నిపిస్తుంది. తాజాగా అలాంటి వ్యాఖ్య మ‌రొక‌టి చేశారు. మిస్ట‌ర్ పాకిస్థాన్ పీఎం.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడు. అణు బాంబులు మీ ద‌గ్గ‌రే కాదు. మా వ‌ద్ద కూడా ఇంకా ఎక్కువ‌గానే ఉన్నాయంటూ ఇమ్రాన్ ఖాన్ ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేశారు.

ముందు జైష్ ఎ మ‌హ్మ‌ద్.. ల‌ష్క‌ర్ ఏ తోయిబా సంస్థ‌ల్ని అంత‌మొందించాల‌ని..ఆ త‌ర్వాత మాట్లాడాల‌న్నారు. జైష్ ఎ మ‌హ్మ‌ద్ అధినేత మ‌సూద్ అజార్ త‌మ దేశంలోనే ఉన్నాడ‌ని.. అత‌ను తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న‌ట్లు పాక్ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌క‌టించ‌టాన్ని అస‌ద్ ప్ర‌స్తావించారు. తీవ్ర‌వాదుల‌కు పాక్ ఆశ్ర‌యం క‌ల్పిస్తుంద‌న‌టానికి ఇంత‌కు మించిన సాక్ష్యం ఇంకేం ఉంటుంద‌ని పేర్కొన్నారు.

అస‌ద్ నోటి నుంచి ఈ తీవ్ర వ్యాఖ్య‌ల‌న్నీ త‌మ పార్టీ 60వ వార్షికోత్స‌వ దినోత్స‌వం సంద‌ర్భంగా చేశారు. హైద‌రాబాద్ లోని పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న‌.. భార‌త దేశ శ‌త్రువే త‌మ శ‌త్రువ‌ని.. పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు భార‌త్ లో స్థానం ఉండ‌ద‌న్నారు. ఇస్లాం పేరుతో ముస్లింల‌ను వంచించ‌టం త‌గ‌ద‌న్న అస‌ద్.. ప్ర‌పంచంలోని అన్ని మ‌తాల్లోకెల్లా ఇస్లాం శ్రేష్ఠ‌మైన‌దిగా అభివ‌ర్ణించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు భార‌తీయ ముస్లింలు ఎల్ల‌వేళ‌లా సిద్ధం ఉన్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. పాక్ వైఖ‌రిని తాము తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు చెప్పారు.
Tags:    

Similar News