భారతమాతాకీ జై అనడానికి నో.. జైహింద్ కు ఓకే

Update: 2016-03-15 09:28 GMT
 నిండు సభల్లో ఎన్నో అన్ పార్లమెంటరీ మాటలు అంటుంటారు... సభలు - సమావేశాల్లో నోటికొచ్చినట్లు దురహంకార కామెంట్లు చేస్తుంటారు... కానీ, 'భారత్ మాతాకీ జై' అని అనడానికి మాత్రం ఆయనకు నోరు రాదట. మెడ మీద కత్తిపెట్టినా కూడా ఆ మాటను ఆయన పలకడట. అంతగా భీష్మిస్తున్న ఆ ప్రజాప్రతినిధి ఇంకెవరో కాదు.... హైదరాబాద్ ఎంపీ - మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.  ఇటీవల ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఆయన మహారాష్ట్రలోని లాతూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ను ఉద్దేశిస్తూ... '' భారత్ మాతాకీ జై'' అన్న పదం నా నోటి నుంచి వినిపించడం కలే అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దేశవ్యాప్తంగా అది కలకలం రేపుతోంది. ఆ వీడియోలో ఆయన ''ప్రతి స్కూలులోనూ భారత్ మాతాకీ జై అన్న నినాదాన్ని అలవాటు చేయాలని ఆరెస్సెస్ చీఫ్ చెబుతున్నారు. కానీ, రాజ్యాంగంలో అదెక్కడా లేదు. నా గొంతుపై కత్తి పెట్టినా ఆ నినాదాన్ని నేను చేయను'' అని అన్నారరు. అదిప్పుడు వివాదంగా మారింది.

అయితే... ఈ వివాదం నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టులో ఒవైసీకి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. దానిపై స్పందించిన అసదుద్దీన్ మాత్రం భిన్నంగా మాట్లాడారు. ''నాకు కోర్టులపై పూర్తి నమ్మకముంది.. న్యాయం జరుగుతుంది.. జైహింద్'' అన్నారు. భారత్ మాతాకీ జై అని అనబోనని చెప్పిన ఆయన జైహింద్ అనడంతో అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఒవైసీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.

కాగా భారత్ మాతాకీ జై అని అనడానికి ఇష్టపడని అసదుద్దీన్ పై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మండిపడుతున్నారు. 'భారత్ మాతాకీ జై' నినాదంపై కొందరు చర్చకు లేవనెత్తడం దౌర్భాగ్యమన్నారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో అందరూ ఒకటై వందేమాతరం అంటూ నినాదం చేశారని...అంటే అమ్మకు వందనం అని అర్థమన్నారు. తల్లికి వందనం చేయడానికి చట్టం చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తల్లికి వందనం చేయడం అందరి కర్తవ్యం, ధర్మమని అసదుద్దీన్ కు చురకలు వేశారు.
Tags:    

Similar News