ఏటీఎంల కోత మొద‌లైంది

Update: 2017-08-07 08:39 GMT
వినియోగం పెరిగిన‌ప్పుడు సప్లై పెరుగుతుంద‌న్న‌ది చాలా కామ‌న్ సూత్రం. కానీ.. అందుకు భిన్న‌మైన తీరులో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి బ్యాంకులు. డ‌బ్బులు తీసుకునేందుకు దేశ ప్ర‌జానీకం ఎక్కువ‌మంది వినియోగించే ఏటీఎంల విస్త‌ర‌ణ‌ను బ్యాంకులు నిలిపివేసిన వైనం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది.

గ‌త ఏడాది చివ‌ర్లో పెద్ద‌నోట్లను ర‌ద్దు చేసిన ద‌రిమిలా బ్యాంకులు ఏటీఎంల విస్త‌ర‌ణ‌ను అంత‌కంత‌కూ త‌గ్గించి వేస్తున్న విష‌యం గ‌ణాంకాల రూపంలో బ‌య‌ట‌కు వచ్చింది. ముఖ్యంగా బ్యాంకు ఆవ‌ర‌ణ‌లో ఉండే ఏటీఎంల‌తో పోలిస్తే.. ఇత‌ర ప్ర‌దేశాల్లో ఏర్పాటు చేసే ఏటీఎంల‌ను ఏర్పాటు చేసే సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గించివేస్తున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తూ రిజ‌ర్వ్ బ్యాంకు గ‌ణాంకాలు వెల్ల‌డ‌య్యాయి.

జూన్ 2017 నాటికి బ్యాంకుల వ‌ద్ద కాకుండా ఇత‌ర ప్ర‌దేశాల ద‌గ్గ‌ర ఉన్న ఏటీఎంలు దేశ వ్యాప్తంగా 98,092 మాత్ర‌మేన‌ని చెబుతున్నారు. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండు వేల వ‌ర‌కూ త‌గ్గిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌త ఏడాది ఈ ఏటీఎంల సంఖ్య 99,989 కావ‌టం గ‌మ‌నార్హం. ఆఫ్ సైట్ ఏటీఎంలు త‌గ్గిపోతుంటే.. ఆన్ సైట్ ఏటీఎంలు (బ్యాంకుల ద‌గ్గ‌ర ఏర్పాటు చేసేవి) మాత్రం పెరుగుతున్నాయి. గ‌త ఏడాది ఈ ఏటీఎంల సంఖ్య 1,01,346గా ఉంటే.. అవి ఈ ఏడాది 1,10,385కు పెరిగాయి.

పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం పెద్ద ఎత్తున న‌గ‌దు కొర‌త‌ను బ్యాంకులు ఎదుర్కొన్నాయి. దీని ప్ర‌భావం ఏటీఎంల విస్త‌ర‌ణ‌పై ప‌డింద‌ని చెబుతున్నారు. ఇదే రీతిలో ఆఫ్ సైట్ ఏటీఎంల సంఖ్య అంత‌కంత‌కూ త‌గ్గితే  నిత్యం ఏటీఎంల మీద ఆధార‌ప‌డే ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News