ముసుగువేసి భైంసా డిపో మేనేజర్ పై దాడి

Update: 2019-11-05 11:33 GMT
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మె నేటితో 32వ రోజుకు చేరింది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికులకు విధించిన డెడ్‌లైన్‌ నేటి అర్ధరాత్రితో ముగియనుంది. దీనితో సమ్మె పై ఆర్టీసీ నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సగం రూట్లని ప్రైవేట్ కి అప్పగించిన సీఎం కేసీఆర్ .. నేటి అర్ధరాత్రి తరువాత మిగిలిన సగం రూట్లని కూడా ప్రైవేట్ పరం చేస్తారా లేదా అని చర్చలు జరుగుతున్నాయి. కాకపోతే ఆర్టిసి జేఏసీ నేతలు మాత్రం సమ్మె పై వెనక్కి తగ్గేదే లేదు అని చెప్తున్నారు. కార్మికులు మొండి పట్టు విడకపోతే సీఎం కేసీఆర్ చెప్పినట్టు చేస్తారని .. రాజకీయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతుంది.

ఇటువంటి సమయంలో విధుల్లోకి వెళ్తున్న భైంసా బస్‌ డిపో మేనేజర్‌ జనార్దన్‌పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. ఆయనపై ముసుగు వేసి దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిని ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్  తీవ్రంగా ఖండించింది. మేనేజర్ పై దాడి చేసిన వారిని  గుర్తించి కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కృష్ణ కాంత్ డిమాండ్‌ చేశారు. అలాగే పెద్దపల్లి జిల్లా కుచిరాజుపల్లిలో ఆర్టీసీ బస్సుపై దాడి జరిగింది. దుండగుల దాడిలో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. కరీంనగర్‌ నుంచి మంథని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.  

భైంసా డిపో మేనేజర్‌పై దాడితో ఆర్టీసీ కార్మికులకు సంబంధం లేదని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. అధికారిపై దాడిని ఆర్టీసీ జేఏసీ ఖండిస్తోందని తెలిపారు. గత 32 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. సమ్మెలో భాగంగా నేడు అన్ని డిపోల వద్ద మానవహారాలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అలాగే ఈ నెల 9 న చలో ట్యాంక్ బండ్ కి పులునిచ్చింది. ఈ అర్ధరాత్రి  తరువాత సీఎం కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై ఇప్పుడు  చర్చలు నడుస్తున్నాయి.
Tags:    

Similar News