చ‌ట్ట‌స‌భ‌లో పెళ్లి ప్ర‌పోజ్ చేసిన ఎంపీ

Update: 2017-12-04 10:15 GMT
చ‌ర్చ‌లు.. వాద‌న‌లు.. విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు.. అప్పుడ‌ప్పుడు వ్యంగ్య వ్యాఖ్య‌లు.. ఇవి ఏ దేశంలోని చ‌ట్ట‌స‌భ‌ల్లో అయినా క‌నిపించే దృశ్యాలు. అందుకు భిన్నంగా.. ఎవ‌రూ ఊహించ‌ని ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంది. చ‌ట్ట‌స‌భ‌లో సీరియ‌స్ గా చ‌ర్చ న‌డుస్తున్న వేళ‌.. ఒక ఎంపీ.. త‌న స‌హ‌చ‌ర ఎంపీని పెళ్లి చేసుకుంటావా? అని అడ‌గ‌టం.. ఆ వెంట‌నే స‌ద‌రు ఎంపీ ముసిముసి న‌వ్వుల‌తో ఓకే చెప్పేసిన వైనం ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ గా మారింది.

అయితే.. ఇక్క‌డో ట్విస్ట్ ఉంది. ఎవ‌రూ ఊహించ‌ని అదేమంటే.. ప్ర‌పోజ్ చేసిన ఎంపీ మ‌గ‌.. పెళ్లికి ఒప్పుకున్న ఎంపీ మ‌గ‌మ‌హారాజే మ‌రి. అందుకే.. ఈ చిత్ర‌మైన వ్య‌వ‌హారం ఇప్పుడు సోష‌ల్ మీడియాలోవిప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

స్వ‌లింగ సంపర్కులు పెళ్లి చేసుకోవటంపై ఒక్కో దేశంలో ఒక్కో విధానం అమ‌ల్లో ఉంది. తాజా ఉదంతం జ‌రిగిన ఆస్ట్రేలియాలోనూ ఈ త‌ర‌హా పెళ్లిళ్ల‌పై నిషేధం ఉంది. తాజాగా ఈ నిషేదానికి చెల్లుచీటి చెప్పేస్తూ తాజాగా స్వ‌లింగ వివాహాల‌కు ఓకే చెప్పేలా చ‌ట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే ఆస్ట్రేలియాలోని ఎగువ స‌భ స్వ‌లింగ వివాహాల‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌.. మిగిలి ఉంది దిగువ స‌భ మాత్ర‌మే.

తాజాగా దిగువ స‌భ‌లో ఈ అంశంపై సానుకూల నిర్ణ‌యం తీసుకున్నారు. స్వ‌లింగ వివాహాల‌ను చ‌ట్ట‌బ‌ద్ధం చేసే బిల్లుపై సీరియ‌స్ గా చ‌ర్చ సాగుతున్న వేళ‌.. ఎంపీ టిమ్ విల్స‌న్ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఎందుకంటే.. ఆయ‌న భాగ‌స్వామి.. మ‌రో ఎంపీ అయిన రాయ‌న్ ప్యాట్రిక్ బోల్డ‌ర్ అక్క‌డే ఉన్నారు. వీరిద్ద‌రూ ఏడేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ఆస్ట్రేలియా చ‌ట్టాల ప్ర‌కారం పెళ్లి చేసుకునే అనుమ‌తి లేక‌పోవ‌టంతో క‌లిసి ఉంటున్నారు.

తాజాగా చేస్తున్న చ‌ట్టంతో వీరు పెళ్లి చేసుకునే వీలు క‌లుగుతుంది. ఈ కార‌ణంతోనే.. చ‌ర్చ ముగిస్తూ త‌న భాగ‌స్వామి రాయ‌న్ వైపు చూస్తూ టిమ్ భావోద్వేగానికి గురి అవుతూ.. ఇక‌.. మిగిలింది ఒక్క‌టే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ చ‌ట్ట‌స‌భ‌లోనే ఓపెన్ గా అడిగేశాడు. దీనికి న‌వ్వులు చిందిస్తూ ఓకే చెప్పేశాడు రాయ‌న్‌.

దీంతో.. స‌భ ఒక్క‌సారిగా సంద‌డిగా మారిపోయింది. స‌భ్యులంతా హ‌ర్ష‌ద్వానాలు చేశారు. సంతోషంతో క‌ర‌తాళ ధ్వ‌నులు చేశారు. ఈ నేప‌థ్యంలో డిప్యూటీ స్పీక‌ర్ రాబ్ మిచెల్లి ఆ జంట‌కు అభినంద‌న‌లు చెప్ప‌టంతో పాటు.. ఇదో అరుదైన క్ష‌ణంగా అభివ‌ర్ణించారు. గే పెళ్లిళ్ల‌కు అనుకూలంగా దిగువ స‌భ ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఇది చ‌ట్టం రూపంలో మార‌నుంది. ఇక‌.. ఇద్ద‌రు ఎంపీలు సైతం త్వ‌ర‌లోనే ఘ‌నంగా పెళ్లి చేసుకోనున్నారు.
Tags:    

Similar News