బడి కోసం 6 కి.మీ.. కాలేజీకి 8 కి.మీ. పరుగు.. అదే ఇప్పుడు పతకం తెచ్చింది

Update: 2022-08-08 10:35 GMT
ఆ కుర్రాడిది నిరుపేద కుటుంబం... ఎంతటి నిరుపేద కుటుంటం అంటే.. అమ్మానాన్న ఇటుక బట్టీ కూలీలు.. దీన్నిబట్టే వారి ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. ఇక ఆ కుర్రాడి చదువు సంగతి చెప్పేదేముంది. సహజంగానే ప్రభుత్వ బడిలో చదివాడు. అది కూడా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలోని బడిలో. అయితే, బడికి బస్సులు, ఆటోల్లో వెళ్లేందుకు డబ్బులు లేవు. దీంతో 6 కిలోమీటర్ల పరుగు.. ఇక కాలేజీకి అయితే.. 8 కిలోమీటర్ల పరుగు. చదువు కోసం పడిన ఆ కష్టం అతడికి ఇప్పుడు మరో రూపంలో కలిసొచ్చింది.

అదెలాగంటే..

లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్.. భారతీయుల శరీరతత్వానికి అసలు సరిపడనిది. అసలు పరుగు పందేలే మన శారీరక దారుఢ్యానికి తగవు. కానీ, అలాంటిచోట 27 ఏళ్ల అవినాశ్ సాబలే అద్భుతమే చేశాడు. ఉసేన్ బోల్ట్, మో ఫరా వంటి ఆఫ్రికా ఖండం, వెస్టిండీస్ దీవుల వారికే పరిమితమైన లాంగ్‌ డిస్టెన్స్‌ రేసులో.. కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గి ఔరా అనిపించాడు. 27ఏళ్ల అవినాశ్ ముకుంద్‌ సాబలేది మహారాష్ట్రలోని వెనుకబడిన బీడ్ జిల్లా. పాఠశాలకు, కళాశాలకు అతడు ''పరుగు''న వస్తుండడం చూసి ఓ ఉపాధ్యాయుడు ప్రోత్సహించాడు.

18 ఏళ్లకే సైన్యంలోకి.. సియాచిన్ లో విధులు

సాబలే 18 ఏళ్ల వయసులో భారత సైన్యంలో చేరాడు. అత్యంత క్లిష్టమైన సియాచిన్‌లో విధులు నిర్వర్తించాడు. . ఆ సమయంలోనే పరుగు పోటీల్లో పాల్గొని పతకాలు గెలిచాడు. అనంతరం కఠినమైన స్టీపుల్‌ఛేజ్‌లో శిక్షణ తీసుకున్నాడు. శనివారం కామన్వెల్త్ క్రీడల పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌లో రజత పతకం సాధించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో లాంగ్‌ డిస్టెన్స్‌లో పతకం నెగ్గిన తొలి భారత పురుష అథ్లెట్‌గా చరిత్ర లిఖించాడు.

రేసంటే.. మామూలు రేసు కాదు..

100 మీటర్ల పరుగు పందెం. 200 మీటర్ల పరుగు పందెం.. 400 మీటర్ల రిలే.. ఇలా ఎన్నో పరుగు పందేల గురించి విని ఉంటారు. వాటన్నిటిలోకి 100 మీటర్ల పరుగు అత్యంత వేగవంతం అయితే.. స్టీపుల్ చేజ్ మరింత సంక్లిష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో సుదీర్ఘ పందెం. 3 వేల  మీటర్ల స్టీపుల్‌ ఛేజ్‌ దే ఇందులో ప్రధాన పాత్ర. ట్రాక్‌పై 28 బారియర్లు, ఏడు వాటర్‌ జంప్స్‌ దాటుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది.  ఒక్కో బారియర్‌ 914 మిల్లీమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఒక్కో ల్యాప్‌కు 400 మీటర్ల చొప్పున మొత్తం ఏడున్నర ల్యాప్‌లు ఉంటాయి. ప్రతీ ల్యాప్‌కు ఒక వాటర్‌ జంప్‌ ఉంటుంది. ఈ లాంగ్‌డిస్టెన్స్‌ రేసులో ఎక్కువగా ఆఫ్రికా దేశస్థులే పతకాలు సాధిస్తున్నారు. 2018లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ కెన్యాకు చెందిన కిప్రుటో కేవలం 8 నిమిషాల 10.08 సెకన్లలోనే ఈ రేసును పూర్తిచేసి స్వర్ణం నెగ్గాడు. రెండో స్థానంలోనూ కెన్యా అథ్లెట్‌ అబ్రహం కిబివోట్‌ రజతం గెలుచుకున్నాడు.

స్వర్ణం అతి స్వల్ప తేడాతో చేజారింది..

స్టీపుల్‌ఛేజ్‌లో అవినాశ్ సాబలేపై ఏ మాత్రం అంచనాల్లేవ్‌. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ అతడు నిరాశపర్చాడు. కామన్వెల్త్ రేసులో మాత్రం చెలరేగిపోయాడు. మొదలైన వెంటనే అందరికంటే ముందే పరిగెత్తాడు. 2 నిమిషాల పాటు ఆధిపత్యం కొనసాగించి మొదటి అడ్డంకిని దాటేశాడు. ఆ తర్వాత కెన్యన్‌ అథ్లెట్లు ముగ్గురు ఒక్కొక్కరిగా సాబలేను దాటుకుంటూ వెళ్లిపోయారు. దీంతో అవినాశ్ నాలుగో స్థానంతో వెనుకబడ్డాడు. 2400 మీటర్ల వరకు కెన్యాకు చెందిన ముగ్గురు తొలి మూడు స్థానాల్లో పరిగెత్తారు. ఇక, అవినాశ్‌కు పతకం అసాధ్యమే అనుకున్నారంతా. కానీ, అప్పుడే సాబలే అద్భుతం చేశాడు. వెనుకంజలో ఉన్నప్పటికీ పతకమే లక్ష్యంగా దూసుకెళ్లాడు. ఆరో ల్యాప్‌ దగ్గర నెమ్మదిగా తన వేగాన్ని పుంజుకున్నాడు. మూడో స్థానానికి.. ఆ వెంటనే రెండో స్థానంలోకి వచ్చాడు.

చివర్లో ఒక దశలో అవినాశ్‌ తొలి స్థానంలోకి వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లాడు. చివరి హర్డిల్‌ సమయంలో ఒకింత కంగారు పడటంతో పాటు.. మొదటి స్థానంలో ఉన్న ప్రత్యర్థి అబ్రహం కిబివోట్‌ సడెన్‌గా తన దిశను మార్చుకోవడంతో గందరగోళానికి గురయ్యాడు. దీంతో రెండో స్థానంతో రేసును ముగించి రజత పతకం సాధించాడు. 8 నిమిషాల 11.20 సెకన్ల టైమింగ్‌తో తన జాతీయ రికార్డు (8.12.48 )ను మెరుపుపర్చుకుని పతకం నెగ్గాడు. అయితే 0.05 సెకన్ల తేడాతో అతడు పసిడి కోల్పోయాడు. అబ్రహం 8.11.15 నిమిషాల్లో స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో కెన్యా దేశస్థులు కాకుండా మరో దేశానికి చెందిన అథ్లెట్‌ ఈ లాంగ్‌ డిస్టెన్స్‌ రేసులో పతకం సాధించడం 1994 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌లో  కెన్యన్లు పతకం సాధించిన సమయంలో అవినాశ్ కనీసం ఈ రేసులో అడుగైనా పెట్టలేదు. 2015 నుంచి ఈ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టిన సాబలే.. తక్కువ సమయంలోనే దేశానికి పతకం అందించి సరికొత్త ఘనత సాధించాడు.
Tags:    

Similar News