బెంగ‌ళూరులో ఫుల్లు ఎంజాయ్ చేసేయొచ్చు

Update: 2016-07-18 10:25 GMT
ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు ఎట్ట‌కేల‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయి నగరాలకు దీటుగా బెంగళూరును నిలిపేందుకు రాత్రి జీవనాన్ని (నైట్‌ లైఫ్‌) అమలులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం పచ్చ జెండా వూపింది. ఇందులో భాగంగా ఉదయం తొమ్మిది నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు - బార్‌ అండ్‌ రెస్టారెంట్లు  తెరచి ఉంచేందుకు అవకాశం ఉంటుంది. గతంలో శని - ఆదివారాలకే పరిమితమైన ఈ అవకాశం ఇకపై వారంలో అన్ని రోజులకు పొడిగించింది. ఈ కొత్త ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి.

ఉద్యోగ ప‌రిస్థితుల రీత్యా రాత్రిళ్లు విధులు నిర్వహించి ఆలస్యంగా ఇళ్లకు వెళ్లేవారు - విదేశీ అతిథులు రాత్రి 11 గంటల తరువాత భోజనం చేయటం - మద్యం తాగాలని కోరుకుంటున్న నేపథ్యంలో దీనికి తాము అనుమతించామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బార్లు - రెస్టారెంట్ల యజమానులు కూడా ఈ అంశమై పలుమార్లు కోరడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఆయన వెల్లడించారు. బార్లు - రెస్టారెంట్లు ఇకపై అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరచి ఉంచనున్నందున చుట్టుపక్కల ప్రత్యేక భద్రత కల్పించాలని నిర్ణయించామని నగర పోలీసు కమిషనర్‌ మేఘరిక్‌ వెల్లడించారు. తన కార్యాలయంలో అన్ని విభాగాల డీసీపీలు - అదనపు పోలీసు కమిషనర్లు - ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. భద్రత కోసం తీసుకోవలసిన చర్యల్ని అధికారులతో చర్చించామని తనను కలుసుకున్న విలేకరులకు తెలిపారు. బార్లు - మద్యం విక్రయ కేంద్రాల యజమానులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవటం - ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా చూసుకునేలా నిబంధనలను జారీలోకి తీసుకు వస్తామని చెప్పారు. మైనర్లకు మద్యం విక్రయించకుండా నిర్వాహకులు చర్య తీసుకునేలా జాగృతి కల్పిస్తామని మేఘరిక్‌ తెలిపారు. మద్యం తాగాక వాహనాలు నడపకుండా ఆటోలు - టాక్సీలు - తమ డ్రైవర్లు నడిపే వాహనాల్లో ఇళ్లకు వెళ్లేలా సూచనలు చేస్తామని చెప్పారు.
Tags:    

Similar News