కోహ్లీని రాజీనామా చేయమన్న బీసీసీఐ!

Update: 2017-07-29 08:00 GMT
రాజీనామా అంటే టీమ్ ఇండియా కెప్టెన్సీకి అనుకునేరు. ఇది వేరే వ్యవహారం. భారత జట్టులో ఆటగాడిగా ఊంటూ.. కోహ్లి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)’లో ఉద్యోగిగా కొనసాగడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఇది విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందని.. కాబట్టి ఆ ఉద్యోగానికి రాజీనామా చేయమని బీసీసీఐ.. కోహ్లిని కోరింది. కాస్త ఫేమ్ ఉన్న ఆటగాళ్లకు ప్రభుత్వ రంగ.. ప్రైవేటు సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడం మామూలే. జాతీయ.. దేశవాళీ జట్లకు ఆడే క్రికెటర్లు వేరే ఏ పదవుల్లోనూ ఉండకూడదని.. అలా చేస్తే అది విరుద్ధ ప్రయోజనాల కిందికి వస్తుందని సుప్రీం కోర్టు నియమిత లోధా కమిటీ స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీసీఐ.. కోహ్లిని ఇలా కోరింది.

ఆటగాళ్లకు ప్రభుత్వ రంగ.. ప్రైవేటు సంస్థలు ఉద్యోగాలివ్వడం మామూలే. ఐతే వాళ్లేమీ రోజూ వచ్చి ఉద్యోగాలు చేయనక్కర్లేదు. ఆట ఆడుతూ తమ సంస్థలకు ప్రచారం చేసిపెడితే చాలు. ఆన్ డ్యూటీ కిందే పరిగణించి.. వారికి జీతాలిస్తాయి ఆయా సంస్థలు. ఇది ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. కోహ్లి మాత్రమే కాదు.. వీరేంద్ర సెహ్వాగ్.. గౌతమ్ గంభీర్ లాంటి చాలా మంది క్రికెటర్లు ఓఎన్జీసీ ఉద్యోగులే. ఇంకా పలు క్రీడలకు చెందిన ఆటగాళ్లు ఓఎన్జీసీలో ఉద్యోగం చేస్తున్నారు. ఐతే బీసీసీఐలో విరుద్ధ ప్రయోజనాల విషయంలో లోధా కమిటీ మొదట్నుంచి చాలా కఠినంగా ఉంటున్న నేపథ్యంలో పాలకులపైనే కాక ఆటగాళ్ల మీదా ప్రభావం పడుతోంది. ఇటీవలే భారత అండర్-19 జట్టు కోచ్ గా తిరిగి నియమితుడైన ద్రవిడ్.. ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటార్ గా తనకున్న పదవిని వదులుకున్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News