ట్రాఫిక్ ఫైన్ కట్టడానికి తాళి తాకట్టు పెట్టింది!!

Update: 2021-02-28 03:43 GMT
మ‌న దేశంలో చ‌ట్టాలు కొంద‌రికి చుట్టాల‌నే మాట ఉంది. రాజ‌కీయంగా ప్ర‌భావం చూపించేవారికి.. స‌మాజంలో సెల‌బ్రిటీల‌కు ఈ చ‌ట్టాలు చుట్టాల‌నే వ్యాఖ్య‌లు త‌ర‌చుగా వినిపిస్తుంటాయి. వారు ఎలాంటి త‌ప్పులు చేసినా.. చ‌ట్టాలు ఉదాశీనంగా ఉంటాయి. వీటిని అమ‌లు చేసేవారు కూడా ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రిస్తారు. కానీ, సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి మాన‌వుల విష‌యంలో మాత్రం ఈ చ‌ట్టాలు ఎప్పుడూ క‌త్తులు నూరుతూనే ఉన్నాయి. ప‌రిస్థితి ఎంత బాగోకున్నా.. చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులు.. పోలీసులు సైతం ప‌ట్టుబడే సంఘ‌ట‌న‌లు అనేకం.

ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన కొత్త ర‌వాణా చ‌ట్టం ప్ర‌జ‌ల పాలిట తీవ్ర ఇబ్బందిక‌ర చ‌ట్టంగా ప‌రిణ‌మించింద‌నే వాద‌న ఉంది. చిన్న‌పాటి త‌ప్పుల‌కే భారీ ఫైన్లు విధించ‌డం.. ప్ర‌యాణ‌దారుల‌ను పీడించ‌డం.. ఖ‌జానా నింపుకోవడం అనే కీల‌క సూత్రాలు ఈ చ‌ట్టం కింద ఉన్నాయి. అయితే.. కొన్ని రాష్ట్రాలు ఈ చ‌ట్టాన్ని అమ‌లు చేస్తున్నాయి. మ‌రికొన్ని స్థానిక చ‌ట్టాలు అమ‌లు చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొత్త ర‌వాణా అమ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారంటూ.. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌హిళ‌కు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా 3000 ఫైన్ విధించారు. దీంతో ఆమె త‌న ద‌గ్గ‌ర అంత డ‌బ్బు లేద‌ని.. లైసెన్సు తీసుకుని విడిచి పెట్టాల‌ని.. త‌ర్వాత చెల్లిస్తాన‌ని ప్రాధేయ‌ప‌డింది. అయినా.. స‌రే పోలీసులు ప‌ట్టుబ‌ట్ట‌డంతో చివ‌ర‌కు ఆ మహిళ తన మంగళసూత్రాన్ని జరిమానా కింద ఇవ్వడం సంచలనం సృష్టించింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు జరిమానా చెల్లించడానికి డబ్బు లేకపోవడంతో కర్ణాటకలో 30 ఏళ్ల మహిళ ట్రాఫిక్ పోలీసులకు తన మంగళసూత్రాన్ని ఇవ్వ‌డం దేశ‌వ్యాప్తంగా తీవ్ర సంచ‌ల‌నంగా మారింది.

మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన దంపతులు ఇద్దరు సిటీ మార్కెట్‌లో మంచం కొనుగోలు చేసేందుకు రూ.1800 తమ వెంట తీసుకెళ్లారు. మార్కెట్‌లో రూ. 1700 విలువైన మంచాన్ని వారు కొనుగోలు చేశారు. అయితే.. వారు త‌మ స్కూటీని రాంగ్ పార్కింగ్ చేశారంటూ.. ట్రాఫిక్ పోలీసులు బండికి రూ.3000 ఫైన్ విధించారు. అయితే.. అప్ప‌టికే త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బుల‌తో మంచం కొన‌డం..  అల్పాహారం కోసం తమ దగ్గరున్న చివరి రూ.100 కూడా ఖర్చు చేయ‌డంతో పోలీసుల‌ను ప్రాధేయ ప‌డ్డారు. అయినా.. పోలీసులు చ‌ట్టం పేరుతో క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో  చివరికి చేసేది లేక.. తన దగ్గరున్న మంగళసూత్రాన్ని వారికిచ్చినట్టు తెలిపారు. దీనిపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించ లేదు.  


    

Tags:    

Similar News