భీమ‌వరం గ్రౌండ్ రిపోర్ట్‌!... పీకే 'ప‌వ‌ర్' ఎంత‌?

Update: 2019-03-22 12:51 GMT
నియోజ‌క‌వ‌ర్గం:  భీమ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం

అభ్య‌ర్థులు:

టీడీపీ:.. పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు
వైసీపీ:  గ్రంథి శ్రీ‌నివాస్‌
జ‌న‌సేన‌:  ప‌వ‌న్ క‌ల్యాణ్

ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే: పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు (అంజిబాబు) (టీడీపీ)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వ‌చ్చిందంటే చాలు... ఇటు ఏపీ ప్ర‌జ‌ల‌కే కాకుండా అటు తెలంగాణ ప్ర‌జ‌లకు ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే ఊరు భీమ‌వ‌రం. ఎందుకంటే అచ్చ తెలుగు సంక్రాంతితో పాటు ఆ సంద‌ర్భంగా జ‌రిఏ కోడి పందేల‌ను చూడాలంటే... భీమ‌వ‌రం వెళ్లాల్సిందే. ఎన్ని ఆంక్ష‌లున్నా - ఎంతమంది పోలీసు బ‌ల‌గాలున్నా... సంక్రాంతి సంద‌ర్భంగా భీమ‌వ‌రంలో కోడి పందేలు జ‌రిగి తీరతాయంతే. ఈ పోటీల్లో మునిగి తేలేవారు ఏ సామాన్యులో - జూదంపై మక్కువ ఉన్న‌వారో కాదు.... సామాన్యుల నుంచి రాజ‌కీయ నాయ‌కుల దాకా అంద‌రూ అక్క‌డి బ‌రుల్లో క‌నిపిస్తారు. రెండు నెల‌ల క్రితం సంక్రాంతి ముగిసినా.. ఇప్పుడు భీమ‌వ‌రంలో మ‌రోమారు బ‌రులు సిద్ధ‌మైపోయాయి. అయితే ఈ బ‌రులు కోడి పందేల కోసం ఏర్పాటు చేసిన‌వి కాదు. త‌మ నేత‌ల‌ను ఎన్నుకునేందుకు రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటుగా భీమ‌వ‌రం ఓట‌ర్లు సిద్ధం చేసుకున్న బ‌రులు. త్రిముఖ పోరు నెల‌కొన్న భీమ‌వ‌రం పోరు ఈ ద‌ఫా మ‌రింత ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే... ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగేశారు. విశాఖ జిల్లా గాజువాక నుంచే కాకుండా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క స్థాన‌మైన భీమ‌వ‌రం నుంచి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలోకి దిగేశారు. దీంతో భీమ‌వ‌రం పేరు ఒక్క‌సారిగా హాట్ టాపిక్‌ గా మారిపోయింది.

భీమ‌వ‌రం స్థానిక ప‌రిస్థితుల‌ను ఓసారి ప‌రిశీలిస్తే... భీమ‌ర‌వంలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా... రాజులే కీల‌క పాత్ర పోషిస్తుంటారు. బీసీలు - ఆ త‌ర్వాత కాపులు అత్య‌థికంగా క‌లిగిన భీమ‌వరంలో ప్ర‌జా ప్ర‌తినిధులుగా మాత్రం క్ష‌త్రియ వ‌ర్గానికి చెందిన వారే కొన‌సాగుతున్న వైనం మ‌న‌కు తెలియ‌నిదేమీ కాదు. రెండు ల‌క్ష‌ల ఓట‌ర్ల దాకా ఉన్న భీమ‌వ‌రంలో బీసీల ఓట్లు 75 వేల‌కు పైగానే ఉన్నాయి. భీమ‌వ‌రంలో ఈ స్థాయిలో ఓట్లున్న సామాజిక వ‌ర్గం మ‌రొక‌టి లేదు. ఆ త‌ర్వాత కాపుల ఓట్లు కూడా 65 వేల‌కు పైగానే ఉన్నాయి. ఇక ఆ త‌ర్వాత క్ష‌త్రియ‌ - ఎస్సీ - ఎస్టీలు - ఇత‌ర సామాజిక వ‌ర్గాల ఓట్లు ఉన్నాయి. మొత్తంగా ఇక్క‌డి ఫ‌లితాన్ని తేల్చే సామాజిక వ‌ర్గంగా కాపుల ఓట్ల‌నే చెప్పుకోవాలి. బీసీల ఓట్లు అత్య‌ధికంగా ఉన్న‌ప్ప‌టికీ కాపుల ఓట్ల‌లో మెజారిటీ ద‌క్కించుకునే అభ్యర్థే ఇక్క‌డ విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు. సో... భీమ‌వ‌రంలో కాపుల ఓట్ల‌ను ఎవ‌రైతే అధికంగా సాధిస్తారో... ఈ ద‌పా కూడా వారిదే గెలుపు. ఈ లెక్క‌లేసుకున్న కార‌ణంగానే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇక్క‌డి నుంచి పోటీకి దిగార‌న్న వాద‌న వినిపిస్తోంది.

గ‌తంలోని ప‌రిస్థితుల‌ను ఓ సారి ప‌రిశీలిస్తే... 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన గ్రంథి శ్రీ‌నివాస్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెన్మ‌త్స వెంక‌ట‌ సాంబ‌శివ‌రాజును ఓడించారు. ఆ త‌ర్వాత 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ ఎంట్రీ ఇవ్వ‌గా... ఆ పార్టీలో చేరిన గ్రంథి శ్రీ‌నివాస్‌ కు టికెట్ ద‌క్క‌క‌పోగా,... ఆ పార్టీ త‌ర‌ఫున వేగేశ్న సూర్య‌నారాయ‌ణ రాజును టీడీపీ కేండిడేట్ గా పోటీ చేసిన పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు ఓడించారు. ఇక 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పుల‌ప‌ర్తికే టీడీపీ టికెట్ ఖ‌రారు కాగా... గ్రంథి శ్రీ‌నివాస్ వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో మ‌రోమారు పూల‌ప‌ర్తి విజ‌యం సాధించ‌గా... గ్రంధి శ్రీ‌నివాస్ తొలిసారి ఓట‌మిపాల‌య్యారు. అయితే పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కార‌ణంగా వైసీపీ ఈ ద‌ఫా కూడా గ్రంథికే టికెట్ ఖారారు చేసింది. టీడీపీ నుంచి కూడా సిట్టింగ్  ఎమ్మెల్యేగా ఉన్న పుల‌ప‌ర్తి బ‌రిలోకి దిగారు. ఇక కొత్త‌గా జ‌న‌సేన నుంచి ఈ సారి నేరుగా ప‌వ‌న్ క‌ల్యాణే బ‌రిలోకి దిగ‌డంతో ఇక్క‌డి పోటీపై ఆసక్తి నెల‌కొంది.

ఇటు సిట్టింగ్ అభ్య‌ర్థిగా అంజిబాబు - అటు వైసీపీ అభ్య‌ర్థిగా గ్రంధి శ్రీ‌నివాస్‌... మ‌ధ్య‌లో జ‌న‌సేన అభ్య‌ర్థిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ రంగంలోకి దిగినా... ప‌వ‌న్ తో పాటు ఎవ‌రికి వారే త‌మ‌దే విజ‌య‌మ‌ని ధీమాగా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని సెంటిమెంట్ ప్ర‌కారం కాపులంతా త‌న‌కే ఓటేస్తార‌ని - అంతేకాకుండా సినిమా పిచ్చోళ్ల‌లో ఫ‌స్ట్ బెంచ్ లోనే ఉండే భీమ‌వ‌రంలో త‌న‌కు ఎదురే లేద‌న్న‌ది ప‌వ‌న్ వాద‌న‌గా వినిపిస్తోంది. అంతేకాకుండా సొంత జిల్లా కావ‌డం - కొత్త‌గా న‌మోదైన వేలాది ఓట్ల‌న్నీ కూడా త‌న‌కే ప‌డ‌తాయ‌న్న‌ది కూడా ప‌వ‌న్ అంచ‌నాగా తెలుస్తోంది. ఇక టీడీపీ అభ్య‌ర్థి అంజిబాబు విష‌యానికి వ‌స్తే... పైకి ధీమాగానే క‌నిపిస్తున్నా... ఓట‌మి భ‌యం ఆయ‌న‌లో స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఇటు టీడీపీ ఓటింగ్ తో పాటు అటు బీజేపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తు కూడా ద‌క్కిన కార‌ణంగానే గెలిచిపోయిన అంజిబాబు.. ఇప్పుడు ప‌వ‌నే నేరుగా బ‌రిలోకి దిగ‌డంతో త‌న ఓటు బ్యాంకు మొత్తం ప‌టాపంచ‌లేన‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న ఓట‌మి ప‌క్కానేన‌న్న అభిప్రాయానికి ఆయ‌న వ‌చ్చిన‌ట్టుగా చెబుతున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి మాత్రం చాలా ధీమాగానే క‌నిపిస్తున్నారు.

గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో మూడు పార్టీలు క‌లిసి బ‌రిలోకి దిగినా... తాను 77 వేలకు పైగా ఓట్లు సాధించాన‌ని - ఇప్పుడు ఆ మూడు పార్టీలు కూడా మూడు ముక్కలు కావ‌డంతో త‌న విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేనన్న‌ది ఆయ‌న భావన. అయితే ఎప్పుడైతే ప‌వ‌న్ బ‌రిలోకి దిగారో... అప్పుడే శ్రీ‌నివాస్ అలెర్ట్ అయిపోయారు. ప‌వ‌న్ కు ఉన్న సినీ గ్లామ‌ర్ త‌న‌ను ఎక్క‌డ ముంచేస్తుందోన‌న్న అనుమానంతో ప‌క్కా ప్లాన్‌ను ర‌చించుకుంటున్నారు. అయితే శ్రీ‌నివాస్ కు వైసీపీ అధిష్ఠానం గ‌ట్టి ధైర్యాన్ని ఇచ్చింద‌న్న ఓ కొత్త వార్త కూడా ఇప్పుడు భీమ‌వ‌రంలోనే కాకుండా యావ‌త్తు రాష్ట్రంలో హాట్ టాపిక్‌ గా మారింది. విజ‌యావ‌కాశాలు మ‌న‌కే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని - ప‌క‌డ్బందీగా వ్యూహం ర‌చించుకుని ప‌వ‌న్‌ ను ఓడిస్తే... వ‌చ్చే వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క మంత్రి ప‌ద‌వి నీదేన‌ని వైసీపీ అధిష్ఠానం శ్రీ‌నివాస్‌ కు బంప‌ర్ ఆఫ‌ర్ ప్రక‌టించింద‌ట‌. దీంతో రంగంలోకి దిగిపోయిన శ్రీ‌నివాస్‌.. ప్ర‌స్తుతం న‌ర‌సాపురం ఎంపీగా బ‌రిలోకి దిగిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ర‌ఘురామ‌కృష్ణంరాజు సాయం కూడా తీసుకుంటున్నార‌ట‌.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యానికి వ‌స్తే... సినీ అభిమానంలో భీమ‌వ‌రానికి సాటి రాగ‌ల ప‌ట్ట‌ణం గానీ - ప‌ల్లె గానీ తెలుగు నేల‌లో లేవ‌నే చెప్పాలి. ఏ హీరోకు అయినా భీమ‌వ‌రంలో గ‌ట్టి ఫ్యాన్సే ఉన్నారు. ఇక ప‌వ‌ర్ స్టార్‌ గా ఎదిగిన ప‌వ‌న్‌ కు చెప్పేదేముంది. భీమ‌వ‌రంలో ప‌వ‌న్‌ కు వీరాభిమానులు లెక్క‌లేనంత మంది ఉన్నారు. వీరంతా పోలింగ్ కేంద్రాల‌కు రావ‌డంతో పాటు త‌మ హీరో విజ‌యం కోసం గ‌ట్టిగా కృషి చేస్తే... ప‌వ‌న్ గెలుపు ఈజీనేన‌న్న వాద‌న లేక‌పోలేదు. అంతేకాకుండా త‌న సొంత జిల్లా కావ‌డంతో త‌న సామాజిక వ‌ర్గ ఓట్ల‌న్నీ కూడా త‌న‌కే ప‌డ‌టం ఖాయ‌మ‌ని కూడా ప‌వ‌న్ భావిస్తున్నారు. సినిమా స్టార్‌ గానే కాకుండా స‌మాజంలోని ప‌లు కీల‌క అంశాల‌పై మంచి పట్టున్న వ్య‌క్తిగా - రాగ‌ధ్వేషాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని పేరుండ‌టం కూడా ప‌వ‌న్‌కు క‌లిసి వ‌చ్చే అంశ‌మేన‌ని విశ్లేష‌ణ‌లు కూడా లేక‌పోలేదు. అంతేకాకుండా ముందుగా స‌ర్వే చేసుకుని - అన్ని లెక్క‌లు అంచ‌నా వేసుకున్న త‌ర్వాతే ప‌వ‌న్‌... భీమ‌వరం బ‌రిని ఎంచుకున్నార‌ని కూడా చెప్పాలి.

టీడీపీ అభ్య‌ర్థి పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు బలాలు

# స్థానికుడు
# వ‌రుస‌గా రెండు సార్లు గెలుస్తూ వ‌స్తుండ‌టం
# ప‌దేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండ‌టంతో భారీగా అభివృద్ధి ప‌నులు
 
బ‌ల‌హీన‌త‌లు

# పార్టీలో అస‌మ్మ‌తి
# గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్ల‌లో చీలిక‌
# అందుబాటులో ఉండ‌ర‌న్న ఆరోప‌ణ‌

వైసీపీ అభ్య‌ర్థి గ్రంథి శ్రీ‌నివాస్‌ బ‌లాలు

# స్థానికుడు
# 2004లో ఎమ్మెల్యేగా త‌న‌దైన శైలి అభివృద్ధి
# వెన్నుద‌న్నుగా నిలుస్తున్న పార్టీ అధిష్ఠానం
# 2004 నుంచి కూడా నియోజ‌క‌వ‌ర్గాన్ని వీడ‌ని తీరు

బ‌ల‌హీన‌త‌లు
# టికెట్ ఖారారులో చివ‌రి దాకా అస్ప‌ష్ట‌త‌
# ప‌వ‌న్ మేనియాను త‌ట్టుకుంటారా? అన్న అనుమానం

జ‌న‌సేన అభ్య‌ర్థి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌లాలు

# అశేష అభిమాన ధ‌నం
# స‌మాజంపై విస్తృత అవ‌గాహ‌న ఉంద‌న్న భావ‌న‌
# భారీ సంఖ్య‌లో సొంత సామాజిక వ‌ర్గ ఓట‌ర్లు
# చిరు పార్టీ సెంటిమెంట్ క‌లిసొస్తుంద‌న్న భావ‌న‌

బ‌లహీన‌త‌లు

# సింగిల్ సీటుకు పోటీపై న‌మ్మ‌కం లేక రెండో స్థానం నుంచి పోటీ అన్న భావ‌న‌
# గెలిపిస్తే... ప‌ట్టించుకుంటార‌న్న గ్యారెంటీ లేక‌పోవ‌డం

ఇలా మూడు పార్టీల అభ్య‌ర్థుల‌కు కొన్ని ప్ల‌స్‌ ల‌తో పాటు మ‌రికొన్ని మైన‌స్‌ లూ ఉన్నాయి. అయితే గ‌డ‌చిన ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితితో ఇప్ప‌టి ప‌రిస్థితిని కాస్తంత పోల్చి చూస్తే.. జ‌న‌సేన‌ - బీజేపీల ఓటింగ్ చీల‌డంతో పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులుకు దెబ్బ ప‌డే ప్ర‌మాదం లేక‌పోలేదు. అదే స‌మ‌యంలో టీడీపీ - బీజేపీ ఓటింగ్ లేకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ సొంతంగా ఏ మేర‌కు రాణిస్తారన్న‌ది ఇప్పుడు అతి పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అయితే కొత్తగా న‌మోదైన ఓట్ల‌న్నీ త‌న‌కే ప‌డ‌తాయ‌ని, దానికి తోడు ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న త‌న సామాజిక వ‌ర్గం ఓట్లు తోడైతే త‌న గెలుపున‌కు ఢోకా లేద‌న్న ధీమాతో ప‌వ‌న్ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే టీడీపీ - జ‌న‌సేన‌ - బీజేపీల ఓటింగ్ ఎవ‌రికి వారుగా చీలుతుండ‌టం... వైసీపీ ఓటింగ్ మాత్రం చెక్కుచెద‌ర‌కుండా ఉండ‌టం గ్రంధి శ్రీ‌నివాస్‌ కు క‌లిసి వ‌స్తుంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న‌దైన మేనియాతో ప‌వ‌నో - లేదంటే ప‌టిష్ట‌మైన ఓటు బ్యాంకుతో గ్రంథి శ్రీ‌నివాస్‌ నో విజ‌యం వ‌రించే అవ‌కాశాలున్నాయి. ఈ ద‌ఫా ఇక్క‌డ టీడీపీ మాత్రం విజ‌యం సాధించే అవ‌కాశాలే లేవ‌న్న‌ది అంద‌రూ చెబుతున్న మాట‌గా వినిపిస్తోంది. అయితే ఎవ‌రి మాట ఎలా ఉన్నా... పోలింగ్ నాడు ఓట‌ర‌న్న ఎవ‌రికి ఓటేసి వ‌స్తే... వారిదే గెలుప‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News