బాబును భూమ‌న ఉతికి ఆరేశారుగా!

Update: 2017-03-04 11:15 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు నిత్యం వైసీపీ అధినేత వైఎస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నామస్మ‌ర‌ణ చేస్తూ పాల‌న సాగిస్తున్న వైనం మ‌న‌కు తెలిసిందే. ఏకంగా కేబినెట్ భేటీలో... రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమంపై చ‌ర్చ జ‌ర‌పాల్సిన చంద్ర‌బాబు... అక్క‌డ కూడా జ‌గ‌న్ అంశంపైనే గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధం చేసుకోవ‌చ్చు. అయినా జ‌గ‌న్ ను చూసి చంద్ర‌బాబు అంత‌గా భ‌య‌ప‌డటానికి గ‌ల కార‌ణాలేంట‌న్న విష‌యానికి వ‌స్తే... ప‌లువురు ప‌లు కార‌ణాలు చెబుతున్నారు.

మొన్న‌టికి మొన్న బాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఏపీ మ్యాపును గ‌న్ తో పోల్చి.. ఆ గ‌న్‌ ను కాల్చే ద‌మ్మున్న నేత జ‌గ‌నేనంటూ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. అంటే ఏపీని ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌గ‌లిగే సామ‌ర్థ్యం ఒక్క జ‌గ‌న్‌కే ఉంద‌న్న‌ది వ‌ర్మ థియ‌రీగా క‌నిపించింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌నపై కీల‌క‌ చ‌ర్చ సాగుతున్న స‌మ‌యంలో వ‌ర్మ సంధించిన ట్వీట్లు నిజంగానే జ‌నాన్ని ఇట్టే ఆక‌ట్టుకున్నాయి. వ‌ర్మ  చెప్పిన‌ట్లుగా... ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధన ఒక్క జ‌గ‌న్‌ తోనే సాధ్య‌మ‌న్న భావ‌న కూడా జ‌నాల్లో వ్య‌క్త‌మైన విష‌య‌మూ తెలిసిందే.

తాజాగా మొన్న నందిగామ స‌మీపంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంపై జ‌గ‌న్ స్పందించిన తీరు చూసి బాబు సర్కారు బెంబేలెత్తిపోయింది. ఆ మ‌రునాడు నిర్వ‌హించిన కేబినెట్ భేటీలో జ‌గ‌న్ నందిగామ ఆసుప‌త్రి సంద‌ర్శ‌న‌కు సంబంధించిన వీడియోల‌ను చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా వేయించి మ‌రీ త‌న కేబినెట్ మిత్రుల‌కు చూపించార‌ట‌. ఈ నేప‌థ్యంలో నిన్న హైద‌రాబాదులో మీడియా ముందుకు వ‌చ్చిన వైసీపీ కీల‌క నేత - తిరుప‌తి మాజీ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి... చంద్ర‌బాబు బెంబేలెత్తిపోవ‌డానికి గ‌ల కార‌ణాలివేనంటూ ఓ రెండు విష‌యాలు చెప్పారు.

జ‌గ‌న్ పేరులోని గ‌న్ ను చూసి చంద్ర‌బాబు జ‌డుసుకుని చ‌స్తున్నార‌ని చెప్పిన భూమన‌... చంద్రబాబుకు త‌న పాల‌న మీద త‌న‌కే న‌మ్మ‌కం లేకోవ‌డం కార‌ణంగా ప్ర‌తి చిన్న విష‌యానికీ బెంబేలెత్తిపోతున్నార‌ని చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ పేరులో గ‌న్ ఉంది కాబ‌ట్టి... చంద్ర‌బాబు అండ్ కో... జ‌గ‌న్ ను టెర్ర‌రిస్టుగానూ అభివర్ణిస్తూ బెంబేలెత్తిపోతున్నార‌ని భూమ‌న ఎద్దేవా చేశారు. అయినా ప్ర‌తిప‌క్ష స్థానంలోని జ‌గ‌న్ ను చూసి చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నారంటే... త‌న పాల‌న‌లో త‌ప్పులున్న‌ట్లు చంద్ర‌బాబు  ఒప్పుకున్న‌ట్టేన‌ని కూడా భూమ‌న తేల్చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News