బిగ్ డిబేట్ : రాహుల్ పరువు తీస్తున్నారా... ?

Update: 2022-05-28 02:30 GMT
కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు. గాంధీల వారసుడు అయిన రాహుల్ విదేశీ టూర్లో బిజీగా ఉన్నారు. ఆయన లండన్ పర్యటనలో వరసబెట్టి అక్కడ  మీడియాకు  ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే అనేక కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న కొన్ని  కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయని అంటున్నారు. రాహుల్ గాంధీ రీసెంట్ గా మాట్లాడుతూ భారత్ లో పరిస్థితి పాకిస్థాన్ కంటే దారుణంగా ఉందని కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

అదే కనుక నిజం అయితే రాహుల చాలా దారుణంగా మాట్లాడారు అనే అనుకోవాలి. పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో అందరిలీ తెలుసు. అలాంటి పాక్ తో భారత్ ని పోల్చడమే రాహుల్ లాంటి నాయకుడు చేసిన మొదటి తప్పు అయితే పాక్ కంటే దారుణంగా భారత్ లో అసహనం ఉందని అనడం కూడా దారుణమే. భారత్ లో స్వేచ్చ లేకపోతే విపక్షాలు ఊరుకుంటాయా. ఈ తీరున విదేశాలకు వెళ్ళి మరీ మాట్లాడగలుగుతాయా. సింపుల్ లాజిక్ ని మిస్ అవుతూ రాహుల్ చేస్తున్న ఈ కామెంట్స్ ని బీజేపీ వారు కేవలం కడుపు మంట మాటలుగానే కొట్టిపారేస్తున్నారు.

పాకిస్థాన్ లో తీవ్ర స్థాయిలో అసహనం ఉంటుంది. అది అందరికీ తెలుసు. భారత్ లో ఎవరు ఏమైనా మాట్లాడే పరిస్థితి ఉంది. విపక్షాలు ప్రధాని మీద ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. అటు వైపు నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. మరి ఇది ప్రజాస్వామ్యంలో భాగంగానే అంతా చూస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారత్ లో అసహనం పాలు ఎక్కువ అయిందని భారత్ లో ఏ మీడియాతోనూ రాహుల్ అన్నట్లుగా లేదు, మరి కోరి మరీ విదేశీ గడ్డ మీద అనడం పట్లనే బీజేపీ నుంచి కాకుండా అన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక రాహుల్ విదేశీ టూర్ మీద అపుడే బీజేపీ విమర్శలు చేస్తోంది. ఆయన విదేశాంగ శాఖ నుంచి పొలిటికల్ టూర్ కోసం అనుమతి తీసుకున్నారా అని బీజేపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. రాహుల్ అలా తీసుకోలేదని కూడా కమలనాధులు అంటున్నారు. అయితే రాహుల్ వ్యక్తిగత పర్యటన అని ఆయన ప్రజలకు బాధ్యుడైన ఎంపీ మాత్రమే తప్ప ప్రభుత్వానికి జవాబుదారీగా లేరని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది.

ఇవన్నీ పక్కన  పెడితే ఎపుడైనా స్వేచ్చగా  రాహుల్ విదేశాలకు వెళ్లవచ్చు. అక్కడ మీడియాతో మాట్లాడవచ్చు. కానీ అక్కడ నుంచి భారత రాజకీయాల మీద విమర్శలు చేయడమే తప్పు అనే వారున్నారు. భారత్ పరువు కూడా ఇక్కడ ఉంటుంది అన్నది రాహుల్ వంటి వారు గుర్తించకపోతే ఎలా అన్న ప్రశ్న కూడా వేస్తున్న వారు ఉన్నారు. వాజ్ పేయి వంటి మేధావులు నాడు ఒక్క మాట అనేవారు. రాజకీయ పార్టీల మధ్య వివాదాలు గొడవలు అన్నీ కూడా కేవలం భారత్ గడ్డకే పరిమితం. విదేశాలకు వెళ్తే అంతా ఒక్కటిగానే ఉండాలని.

అలాగే పరాయి వాడు అయినా పరాయి దేశం అయినా మన దేశం మీద విమర్శలు చేస్తే తానే ఖండించేందుకు ముందు ఉంటాను అనే వారు. అలా 1971లో ఇందిరాగాంధీకి పాకిస్థాన్ యుద్ధంలో వాజ్ పేయ్ విపక్ష నేతగా మద్దతు ఇచ్చారు. 1993 ప్రాంతంలో ఆయన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే విపక్ష నేతగా ఐక్యరాజ్యసమితికి ప్రతినిధిగా వెళ్ళి నాడు కాంగ్రెస్ సర్కార్ గురించి గొప్పగా చెప్పారు.

మరి ఆ రాజనీతి ఇపుడు ఏమైంది అన్నదే ప్రశ్న. రాహుల్ ఈ గడ్డ మీద నుంచి ప్రధాని మోడీని ఎన్ని అయినా విమర్శలు చేయవచ్చు. కానీ విదేశీగడ్డ మీద పెద్ద నోరు చేసుకోవడం వల్ల పోయేది భారత్ పరువు మర్యాదలు అన్న సంగతి తెలియకపోతే ఎలా అన్నదే మేధావుల ఆవేదనగా ఉంది. మొత్తానికి రాహుల్ గాంధీ లండన్ టూర్ మాత్రం బీజేపీ కాంగ్రెస్ ల మధ్య మరింతగా మాటల యుద్ధాన్ని పెంచుతోంది. మరి తిరిగి వచ్చిన తరువాత రాహుల్ ఏలాంటి జవాబు చెబుతారో చూడాలి.
Tags:    

Similar News