ఉద్ధ‌వ్ ను పిండేస్తున్న షిండే.. ఎంపీలు కూడా అటే!

Update: 2022-07-19 08:30 GMT
మహారాష్ట్రలో మళ్ళీ రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక ఇలాగ అయ్యిందో లేదో వెంటనే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మాజీ సీఎం థాక్రేకి గట్టి షాక్ ఇవ్వబోతున్నారు.

శివసేనలోని ఎంపీల్లో పెద్ద చీలిక తీసుకురాబోతున్నారు. శివసేనకు లోక్ సభలో 18 మంది  ఎంపీలున్నారు. వీరిలో 12 మంది ఏక్ నాథ్ తో టచ్ లో ఉన్నారు. వీరందరినీ మంగళవారం ఢిల్లీకి తీసుకెళ్లి నరేంద్ర మోడీ, జేపీ నడ్డాతో పాటు మరికొందరు కేంద్రమంత్రులను స్వయంగా షిండేనే పరిచయటం చేయబోతున్నారట.

ఈనెల మొదట్లో శివసేన పార్టీని నిట్టనిలువుగా చీల్చేసి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేసిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన 55 మంది ఎంఎల్ఏల్లో షిండే తనవైపు 40 మందిని లాగేసుకున్నారు. ముందుగా సూరత్ తర్వాత గౌహతికి ఎంఎల్ఏలతో క్యాంపులు రన్ చేశారు. పదిరోజుల క్యాంపు రన్ చేసిన తర్వాత 106 మంది బీజేపీ ఎంఎల్ఏల మద్దతుతో థాక్రేని పదవిలో నుంచి దింపేసి షిండే సీఎం కుర్చీలో కూర్చున్నారు.

అప్పటి నుండే ఎంపీల్లో కూడా చీలికరావటం ఖాయమనే ప్రచారం ఊపందుకున్నది. చివరకు రాష్ట్రపతి ఎన్నిక అయిపోగానే చీలిక ఖాయమైపోయింది. ఇన్నిరోజులు ఎందుకు ఆగారంటే కేవలం రాష్ట్రపతి ఎన్నిక కోసమనే ఆగారు.

ఎంఎల్ఏలతో పాటే ఎంపీల్లో కూడా చీలిక వస్తే కోర్టులో కేసువేస్తే మళ్ళీ ఎంపీల పదవులన్నీ వివాదాల్లో పడుతుందన్న ఉద్దేశ్యంతోనే షిండే ఇన్నిరోజులు ఆగారు. ఎప్పుడైతే రాష్ట్రపతి ఎన్నిక ముగిసిందో వెంటనే పావులు కదిపారు.

మొత్తం మీద ముందు ఎంఎల్ఏల్లో చీలిక తెచ్చారు. తర్వాత థానే మున్సిపల్ కార్పొరేషన్లో చీలిక తెచ్చి మొత్తం కార్పరేషన్ను స్వాధీనం చేసేసుకున్నారు. ఇపుడు ఎంపీల్లో చీలిక ఖాయమైపోయింది. తొందరలోనే  ముంబై కార్పొరేషన్లో శివసేన కార్పొరేటర్లను తనవైపు తిప్పేసుకుని ఇక్కడ కూడా శివసేనను దెబ్బకొట్టాలని ప్లాన్ చేస్తున్నట్లున్నారు. చివరకు ఏకమొత్తంగా శివసేన పార్టీనే షిండే కబ్జా చేసేట్లుగా ఉన్నారు.
Tags:    

Similar News