ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న లాలూ ప్రసాద్.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ

Update: 2022-06-13 06:50 GMT
హెడ్డింగ్ చదివినంతనే తేడాగా అనిపించటం తప్పేం కాదు. అలా అనిపిస్తే మీరు రైట్ ట్రాక్ లో ఉన్నట్లే. నిజమే.. లాలూ ప్రసాద్ యాదవ్ ఏంది? ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవటం ఏమిటి? రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ ఏంటి? పొంతన లేని ఈ మాటలు కాస్తంత కన్ఫ్యూజ్ చేయటం ఖాయం.

ఇంతకూ అసలు విషయం ఏమంటే.. ఇప్పుడు మేం చెబుతున్న లాలూ ప్రసాద్ యాదవ్.. మీరు అనుకునే లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు కాదు. లాలూ అన్నంతనే ఆర్జేడీ చీఫ్ గుర్తుకు వచ్చేస్తుంటారు. ఆలూ ఉన్నంతవరకు లాలూ ఉంటారంటూ అప్పట్లో చెప్పిన మాట కాస్తంత అతిశయం అనిపించినా.. ఏళ్లకు ఏళ్లుగా అధికారంలో చేతిలో లేకుండా.. జైలు జీవితాన్ని అనుభవించిన ఆయన  పేరు మాత్రం తరచూ వార్తల్లోకి రావటం చూస్తే.. అలాంటి ఇమేజ్ ఆయనకే సొంతమనుకోవాలి.

ఇక.. ఇప్పుడీ లాలూ ప్రసాద్ యాదవ్ ఎవరు? అతగాడి కథేంటి? ఒక సాదాసీదా వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసుడు సాధ్యమా? అంటే కాదనే చెప్పాలి. కానీ.. ఇప్పుడు చెప్పే లాలూ కాస్తంత డిఫరెంట్. బిహార్ కు చెందిన ఇతగాడి పేరు కారణంగా తరచూ కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి. మరహౌరా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండే రహీంపుర్ గ్రామానికి చెందిన ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ను అందరూ కర్మభూమి అని పిలుస్తుంటారు.

రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినంతనే ఇతగాడి పేరు మీడియాలోకి రావటానికి కారణం.. గతంలోనూ ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించటమే. అంతేకాదు.. 2017లో ఆయన రాష్ట్రపతి పదవి కోసం పోటీకి అవసరమైన నామినేషన్ పేపర్లు కూడా దాఖలు చేశారు. అయితే.. నిబంధనల ప్రకారం రాష్ట్రపతి పదవికి పోటీ చేయటానికి ముందు.. కొందరు ఎంపీలు సదరు అభ్యర్థి పేరును ప్రతిపాదించాలి. అలాంటిదేమీ ఈ లాలూకు లేకపోవటంతో అతగాడి అప్లికేషన్ రిజెక్టు అయ్యింది.

తాజాగా మాత్రం.. గతంలో మాదిరి కాకుండా పక్కాగా ప్రిపేర్ అయి మరీ ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్లు చెబుతున్నాడు. గతంలో పలు ఎన్నికల్లో పోటీ చేసినా అతడు మాత్రం గెలవలేదు. కాకుంటే 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం లాలూ సతీమణి రబ్రీదేవి ఓటమి.. లాలూ ప్రసాద్ యాదవ్ కారణమని ఒరిజినల్ లాలూ పేర్కొనటమే తన జీవితంలో తాను సాధించిన గుర్తింపుగా పొంగిపోతుంటాడు.

పంచాయితీ ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు ప్రతి దాన్లోనూ పోటీ పడేందుకు ఆసక్తి చూపించే ఇతగాడికున్న ఒకే ఒక్క గుర్తింపు.. అతడి పేరే. దాంతోనే తరచూ వార్తల్లోకి వస్తుంటాడు. ఇంతకీ ఈ లాలూ వయసు ఎంత? అసలేం చేస్తుంటాడన్న సందేహం వచ్చిందా? దానికి సమాధానం వెతికితే.. అతడి వయసు 42 ఏళ్లు.  వ్యవసాయం చేస్తుంటాడు. రానున్న రోజుల్లో మరెలాంటి వార్తతో జనాల ముందుకు వస్తాడో చూడాలి.
Tags:    

Similar News