ఈ దేశంలో చాలానే రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటాయి. కానీ.. మరే రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకోని ఒక అరుదైన పరిణామం బీహార్ అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో అసెంబ్లీలోని ప్రజాప్రతినిధులంతా ఒక ప్రతిజ్ఞ చేశారు. దీని సారాంశం ఏమిటంటే.. తామీ రోజు నుంచి తాగమని.. తాగనివ్వమంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. నిజంగా ఈ రోజు చరిత్రాత్మకంగా అభివర్ణించారు. ‘‘చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుంది. అసెంబ్లీలోచేసిన తీర్మానం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. నిజమే.. అసెంబ్లీ సమావేశాలు అన్న వెంటనే అరుపులు.. కేకలు.. గొడవలు.. ఒకరిపై ఒకరు విమర్శలు.. ఆరోపణలు చేసుకోవటమే కాదు.. ఒక మంచి విషయాన్ని.. ఒక కొత్త మార్గాన్ని అమలు చేస్తామని.. అందుకు తాము కంకణబద్ధులమవుతానని చెప్పటం కనిపించదు. అలాంటిది బీహార్ అసెంబ్లీ అందుకు భిన్నంగా వ్యవహరించటం నిజంగానే విశేషంగా చెప్పాలి.