2000 కోట్ల‌కు బిట్ కాయిన్ కుచ్చుటోపీ!

Update: 2018-04-06 09:43 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర్ క్రిప్టోక‌రెన్సీ అయిన బిట్ కాయిన్ గత ఏడాది ఏకంగా 2000 శాతం పెరిగిన విషయం తెలిసిందే. దీంతో, చాలామంది ఈ ఎల‌క్ట్రానిక్ పేమెంట్ సిస్ట‌మ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎగ‌బ‌డ్డారు. భారీ లాభాల‌ను అర్జిస్తుంద‌న్న `బిట్ కాయిన్`పై పెట్టుబ‌డి పెట్టారు. అయితే, ఆ రకంగా ఆశ‌ప‌డ్డ ఇన్వెస్ట‌ర్ల‌ను ఓ బిట్‌ కాయిన్ ఎంటర్‌ ప్రెన్యూర్ మోసం చేశాడు. ఇన్వెస్ట‌ర్ల‌కు దాదాపు రూ.2000 వ‌ర‌కు కుచ్చుటోపీ పెట్టాడు. ఆ మాయ‌గాడి వ‌ల‌లో దాదాపు 8000 మంది ఇన్వెస్ట‌ర్లు చిక్కుకున్నారు. అత‌డి మోసాన్ని గ్ర‌హించిన ఇన్వెస్ట‌ర్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆ వ్య‌క్తి క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ఢిల్లీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది.

ఢిల్లీకి చెందిన బిట్‌ కాయిన్ ఎంటర్‌ ప్రెన్యూర్ అమిత్ భరద్వాజ్ 2014లో ఓ ఆన్‌ లైన్ మార్కెటింగ్ వ్యవస్థను ప్రారంభించాడు. బిట్‌ కాయిన్ మైనింగ్ ఆపరేషన్స్ పేరుతో సంస్థల‌ను  ఏర్పాటు చేశాడు. అత‌డు ప్రారంభించిన గెయిన్ బిట్‌ కాయిన్  సంస్థ‌....చైనాలో బిట్‌ కాయిన్ మైనింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తోందని, హాంకాంగ్‌ లో దీని ప్రధాన కేంద్రం ఉందని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించాడు. త‌న సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ఇన్వెస్ట‌ర్ల‌కు వ‌ల వేశాడు. దీంతో, దేశవ్యాప్తంగా 8,000 మందికిపైగా దాదాపు రూ.2,000 కోట్లను అత‌డి సంస్థ‌ల్లో పెట్టుబ‌డిగా పెట్టారు. అయితే, అత‌డు త‌మ‌ను మోసం చేశాడ‌ని గ్ర‌హించిన ఇన్వెస్ట‌ర్లు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో, భరద్వాజ్ ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం అత‌డిపై విచార‌ణ చేప‌ట్టారు.

కాగా, క్రిప్టోకరెన్సీలపై భార‌త్ తో పాటు వివిధ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయ‌డ‌మే కాకుండా క్రిప్టోకరెన్సీలపై నియంత్రణ చర్యలు కూడా చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే భార‌త ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ ప్రసంగంలో  బిట్‌కాయిన్స్‌ సహా క్రిప్టోకరెన్సీలన్నీ చట్టవిరుద్ధమనీ, వాటిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించిన‌ విషయం విదిత‌మే.

బిట్‌ కాయిన్స్ లో పెట్టుబడులు పెట్టిన కొన్ని ల‌క్ష‌ల మందికి నోటీసులు జారీ చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర  గ‌తంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వారి నుంచి పన్నులు వ‌సూలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామ‌న్నారు. బిట్‌ కాయిన్స్‌ పై అడ్వాన్స్‌ ట్యాక్స్ లు చెల్లించడం లేద‌న్నారు. ఆ పెట్టుబడులను త‌మ పన్నురిటర్న్స్ లో పొందుపరచలేదన్నారు. బిట్‌ కాయిన్స్‌ లో పెట్టుబ‌డులు పెట్టి ఆ వివరాలను వెల్లడించని వారి నుంచి పన్నులు రాబడతామని, పన్నులు చెల్లించేందుకు చాలామంది ఇన్వెస్టర్లు అంగీకరించారని తెలిపారు.
Tags:    

Similar News