యూపీ భవిత.. మోడీ పరీక్ష.. ‘బ్రాహ్మణుల’ చుట్టూనేనా?

Update: 2021-08-08 14:30 GMT
బీజేపీ అన్నంతనే బ్రాహ్మణ పార్టీగా పేరు వినిపిస్తూ ఉంటుంది. బ్రాహ్మణులతో పాటు అగ్రవర్ణాలు ఎక్కువగా అభిమానించే ఈ పార్టీకి దేశంలోని ఇతర రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. తాజాగా మాత్రం యూపీ బ్రాహ్మణులు భయపెట్టేస్తున్నారు. ఇప్పుడు యూపీ రాజకీయం మొత్తం వారి చుట్టూనే తిరుగుతోంది. జన్మత: బ్రాహ్మణుడైన యూపీ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ చేతిలో పగ్గాలు ఉన్నప్పటికీ.. మరో ఏడు నెలలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న విషయంపై ఇప్పుడు కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గడిచిన నాలుగేళ్ల కాలంలో యోగి సారథ్యంలో యూపీ బీజేపీలో బ్రాహ్మణ వ్యతిరేకత బాగా పెరిగిందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో.. విపక్షాలు ఇప్పుడు బ్రాహ్మణ జపం జపిస్తూ.. ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. దీనికి తగ్గట్లే ఇప్పటికే పలు పార్టీలు బ్రాహ్మణ జపం మొదలు పెట్టింది. యూపీ ఎన్నికల్లో బ్రాహ్మణులు ఎందుకంత కీలకమంటే.. కీలక ఓటుబ్యాంకు వారి చేతుల్లో ఉండటమే దీనికి కారణంగా చెప్పాలి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో.. జనాభాపరంగా చూస్తే 12 శాతం.. మొత్తం ఓట్లలో 20 శాతం బ్రాహ్మణులే ఉంటారు.

ఇంత భారీ ఓటు బ్యాంకు దన్నుగా నిలిస్తే.. అధికారాన్ని హస్తగతం చేసుకోవటం చాలా తేలిక. ఆ మాటకువస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దన్నుగా బ్రాహ్మణులు నిలవటంతోనే.. మేజిక్ విజయం సొంతమైందని చెప్పాలి. అంతకు ముందు బీఎస్పీ అధినేత్రి మాయావతి.. బ్రాహ్మణ.. దళిత కాంబినేషన్ లో టికెట్లు ఇచ్చి.. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే.

గత వ్యూహాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చిన ఆమె ఇప్పుడు బ్రాహ్మణజపాన్ని జపిస్తున్నారు. ఇక.. గత ఎన్నికల్లో అధికారానికి దూరమైన సమాజ్ వాదీ పార్టీ సైతం ఇప్పుడు బ్రాహ్మణ మాటను అదే పనిగా ప్రస్తావిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మార్గంలో పయనిస్తోంది. ఇలా రాజకీయ పార్టీలన్ని ఎవరికి వారు తమకు తోచినంత మేర బ్రాహ్మణుల్ని మచ్చిక చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదంతా చదువుతున్నప్పుడు ఒక సందేహం రాక మానదు.

ముఖ్యమంత్రిగా ఉన్న ఆదిత్యనాథ్ బ్రాహ్మణుడే అయినప్పుడు.. ఆ సామాజిక వర్గం మొత్తం ఆయన వెంటే ఉండాలి కదా? ఎందుకు మిస్ అయ్యారు? ఇంత కీలకమైన వర్గాన్ని ఆయన ఎందుకు చేజార్చుకున్నారు? అన్న సందేహం రాకమానదు. దీనికి సమాధానం వెతికితే.. నాలుగేళ్ల తన పాలనతో దాదాపు500 మంది బ్రాహ్మణులు హత్యకు గురి కావటం కారణంగా చెబుతారు. యోగి సర్కారు చెప్పేదేమంటే.. హత్యకు గురైన వారంతా గ్యాంగస్టర్లు అని చెబుతుంటే.. అఖిల భారత బ్రాహ్మణ మహాసభ మాత్రం అందుకు భిన్నంగా వాదనలు వినిపిస్తోంది. యోగి సర్కారు బ్రాహ్మణుల్ని టార్గెట్ చేసిందని.. ఆయన కేబినెట్ లో 53 మంది మంత్రులు ఉంటే.. తొమ్మిది మంది బ్రాహ్మణులు మంత్రులుగా ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు మాత్రమే కీలక శాఖలు ఇచ్చారే తప్పించి.. మిగిలిన వారంతా ప్రాధాన్యత లేని శాఖలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

తాజా ఎన్నికలు బ్రాహ్మణుల సత్తాను చాటుతాయన్న వాదనను వినిపిస్తున్నారు. దీనికి తగ్గట్లే గతంలో బ్రాహ్మణుల మీద నిప్పులు చెరిగిన మాయవతి సైతం.. ఇప్పుడు బ్రాహ్మణుల్ని ప్రసన్నం చేసుకోవటానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. దీంతో బీజేపీకి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. విపక్షాలు చేస్తున్న ప్రచారం ఏ మాత్రం ప్రభావం చూపించినా బీజేపీకి భారీ నష్టం వాటిల్లక తప్పదంటున్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ బ్రాహ్మణులు మూకుమ్మడిగా బీజేపీకి దన్నుగా నిలవటంతోనే అద్భుతమైన విజయాలు సొంతమయ్యయని.. తాజాగా మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు.

దీంతో.. వీరిని మరోసారి తమ వెంట ఉండేందుకు వీలుగా మోడీషాలు ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోశ్ ద్వారా ముఖ్యమంత్రి యోగిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. గుజరాత్ కేడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ శర్మను బీజేపీలో చేర్చి.. ఆయన్ను యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అంతేకాదు.. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో బ్రాహ్మణులకు పెద్ద పీట వేసేలా జాగ్రత్తలు తీసుకొని.. వారికి తామిచ్చే ప్రాధాన్యతను తెలియజేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. బ్రాహ్మణులే లక్ష్యంగా ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందించటం ద్వారా తాము బ్రాహ్మణుల పక్షపాతి అన్న మాటను వారు అనిపించుకుంటున్నారు. బ్రాహ్మణుల చుట్టూ తిరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీషాల ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. 
Tags:    

Similar News