భార‌త్‌ లో హిందుత్వ ప‌నిచేయ‌దు:ప్ర‌కాశ్ రాజ్

Update: 2018-04-01 07:18 GMT
విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ హిందుత్వంపై త‌న ఎదురుదాడి కొన‌సాగిస్తున్నారు. బీజేపీని ల‌క్ష్యంగా చేసుకొని గ‌త ఏడాది నుంచి ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్ తాజాగా అదే రీతిలో ఆస‌క్తిక‌ర‌మైన జోస్యం చెప్పారు. బీజేపీ పేరును నేరుగా ఎత్త‌కుండా ఆ పార్టీ బ‌లంగా న‌మ్మే హిందుత్వ పై అటాక్ చేశారు. బెంగళూరులో ఇండియా టుడే గ్రూప్‌ నిర్వహించిన `కర్నాటక పంచాయత్‌` కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ బీజేపీ ప్రచారం చేస్తున్న హిందూత్వ భారత్‌లో పని చేయదని జోస్యం చెప్పారు. కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో, కాంగ్రెస్‌ తరఫున నటి కుష్బు,బీజేపీ అధికార ప్రతినిధి మాలవికా అవినాష్ ఈ చ‌ర్చ‌లో పాల్గొన్నారు.

సాంస్కృతిక యుద్ధాలు' అనే అంశంపై చర్చలో పాల్గొన్న ప్రకాశ్‌ రాజ్‌  కన్నడ సంస్కృతిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..  కర్నాటకలో బహుళ సంస్కృతితో కూడిన సామరస్యత ఉందని అన్నారు. అందరూ ఇక్కడ జీవించేందుకు మేం సానుకూల భావన కల్పిస్తామనీ, ప్రతి ఒక్కరూ సామరస్యంతో జీవించాలనీ ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. కర్నాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకొని బీజేపీ తరహా హిందూత్వకు కర్నాటకలో ఆమోదం లభిస్తుందా..? అన్న ప్రశ్నకు జవాబిస్తూ ఫలితాలు వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుందని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. మా(కర్నాటక) రాష్ట్ర ప్రజలకు ఎంతో సహనం ఉందని ఆయన అన్నారు. ఇక్కడ ఏ మతం వారైనా ఇతరుల పట్ల సహనంతో వ్యవహరిస్తారని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యలతో బీజేపీ అధికార ప్రతినిధి మాలవికా అవినాష్‌ జోక్యం చేసుకుని..`నేను హిందువును. లౌకికవాదిని కూడా అని అన్నారు. వేల ఏళ్లుగా ఉన్న హిందువులు ఇతర మతస్థులను ఇక్కడికి అనుమతించారు` అని ఆమె అన్నారు. అదే హిందూ సంస్కృతి అని అంటూ.. రాజ్యాంగంలో ఏమున్నదో.. తెలుసా అంటూ ప్రశ్నించారు. దీనికి ప్రతిగా ప్రకాశ్‌ రాజ్‌ ఘాటుగానే స్పందించారు. రాజ్యాంగంలో ఎక్కడా హిందూ సంస్కృతి గురించి ప్రస్తావించలేదన్నారు. అలాంటి భారత రాజ్యాంగం గురించి నాకు తెలియదు. మీరు చెప్పండి నేను వింటానని ప్రకాశ్‌ రాజ్‌ సమాధానమిచ్చారు. ఒకవేళ మీకు తెలియకపోతే రాజ్యాంగాన్ని చదవండని ఆమెకు సలహా కూడా ఇచ్చారు.

హిందూత్వంలో గోమూత్రాన్ని చల్లాలని జోరుగా ప్రచారం జరుగుతోంద‌ని ప్ర‌కాశ్ రాజ్ పేర్కొంటూ   దాని ప్రకారం ప్రతిరోజూ ఓ గ్లాసు గో మూత్రాన్ని తాగాలని ప్రకాశ్‌ రాజ్ ఎద్దేవా చేశారు. సంస్కృతి ఏదైనా ఎదుటివారి సంస్కృతిని సంతృప్తిపర్చేలా ఉండాలన్నది తన అభిమతమన్నారు. హేతువాదులపై జరుగుతున్న దాడులపై ప్రకాశ్‌ రాజ్‌ ప్రస్తావించినపుడు కేంద్రమంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో మాట్లాడుతూ తాను పశ్చిమబెంగాలోని ఇమామ్‌బాడాలో పుట్టి పెరిగాన‌ని - లేజీలో చదువుకునేటప్పుడు బీఫ్‌ తిన్నానని తెలిపారు. పాకిస్థాన్‌ లోనూ త‌నకు మిత్రులున్నార‌ని చెప్పారు. దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా ప్ర‌జ‌లు క‌లిసి మెల‌సి ఉండాల‌ని చెప్పారు. రెచ్చ‌గొట్టే రాజ‌కీయాల‌ను మేధావులు - ప్ర‌ముఖులు ప్రోత్సహించ‌వ‌ద్ద‌న్నారు.
Tags:    

Similar News