నిద్ర పోతున్నోళ్లకు బాబు గెలిపిస్తారా?

Update: 2015-03-20 09:52 GMT
ప్రతిపక్షం లేని ఏపీ అసెంబ్లీలో మిత్రపక్షాల మధ్య సంవాదంతో సభ సాగిపోతోంది. బడ్జెట్‌ సందర్భంగా తనను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు చేసి.. స్పీకర్‌ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చి.. సభ నుంచి అలిగి వచ్చేసిన జగన్‌.. శుక్రవారం సభకు వెళ్లని విషయం తెలిసిందే.

ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోవటంతో సభ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతోంది. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ మాట్లాడుతూ. హుధూధ్‌ తుఫాను సందర్భంగా ఏపీ సర్కారు వచ్చి సాయం చేసిందని.. కానీ.. బాధితుల పునరావాసం విషయంలో మాత్రం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సహకారం లేకపోవటంతో పలువురు బాధితులు రోడ్ల పక్కనే బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దీనికి బదులుగా సమాధానం ఇచ్చే క్రమంలో మంత్రి రావెల కిషోర్‌బాబు చేసిన వ్యాఖ్యలు అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారాయి. తుఫాను సందర్భంగా తామంతా విశాఖకు వచ్చి పని చేశామని.. తమను బాగా పిండుకున్నారని..కనీసం థ్యాంక్స్‌ చెప్పలేదని.. అయినప్పటికీ తమకు విశాఖ అంటే ఎంతో ప్రేమ అని  బీజేపీ నేతకు చురకలు వేసే ఉత్సాహంలో.. నోరు జారేశారు.

తమ అధినేత నిద్రపోతున్న వారిని సైతం లేపి ఎంపీగా గెలిపించే మంచి మనసున్న పార్టీ తమదంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ విశాఖ ఎంపీని ఉద్దేశించి రావెల చేసిన వ్యాఖ్యలపై అంతే ధీటుగా స్పందించిన విష్ణుకుమార్‌.. తన వద్దకు బాగా నిద్రపోతున్న వారు వస్తే ఏపీ ముఖ్యమంత్రి వద్దకు పంపిస్తానని చెప్పటంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. కానీ.. నిద్రపోయే వారిని కూడా బాబుఎంపీలుగా పంపించటమనే మాట పార్టీని తర్వాత రోజుల్లో ఇబ్బంది పెట్టేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.  అయినా..బాగా నిద్రపోయే వారికి బాబు అంత ప్రాధాన్యత ఇస్తారా?

Tags:    

Similar News