బాబు మెడ‌కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు

Update: 2018-06-06 07:34 GMT
ఎన్డీఏకు గుడ్‌ బై చెప్పిన అనంత‌రం తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కునేందుకు , ఎదురుదాడి చేసేందుకు అధికార బీజేపీ ధీటుగా సిద్ధ‌మ‌వుతోంది. ఒక‌వైపు చంద్ర‌బాబు చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై క్లారిటీ ఇస్తూనే..మ‌రోవైపు ఆయ‌నపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఈ ఎపిసోడ్‌ లో ఎంపీ - బీజేపీ సీనియ‌ర్ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు అయితే టీడీపీ నాయ‌క‌త్వంపై పెద్ద ఎత్తున్నే విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాబు మెడ‌కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చును బిగించారు. కేంద్రంలో ప్రకంపనలు పుట్టించే కుంభకోణాలు బయట పెడ‌తాన‌ని టీడీపీ నేత‌లు వ్యాఖ్యానించడం చిత్రంగా ఉంద‌న్నారు. అలాంటి కుంభ‌కోణాలు బ‌య‌ట‌పెట్టడానికి  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు ముహూర్తం కావాలా అంటూ ఎద్దేవా చేశారు.

దుష్ప్రచార సంఘం అధ్యక్షుడిగా కుటుంబరావుని నియమిస్తే బాగుండేద‌ని జీవీఎల్ న‌ర‌సింహారావు ఎద్దేవా చేశారు. కుటుంబరావుని ఎందుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారో అర్ధం కావడం లేదని ఆయ‌న  వ్యాఖ్యానించారు. కుంభ‌కోణాలు బ‌య‌ట‌పెడ‌తాం అంటున్న కుటుంబ‌రావు ప్ర‌క‌ట‌న‌లు చేసే బ‌దులుగా వెంటనే అవేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. షేర్ మార్కెట్ వ్యాపారాలు చేసే వాళ్ళని ప్రణాళికా సంఘంలో వేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు తాము భ‌యపడబోమ‌ని, వారి దగ్గర ఏం ఆధారాలున్నా బయటపెట్టాల‌ని స‌వాల్ విసిరిన జీవీఎల్ వాటికి త‌గు సమాధానం చెబుతామ‌న్నారు. త‌మ‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌లు చేయ‌డం చిత్రంగా ఉంద‌న్నారు. ఫోన్ ట్యాపింగ్‌ లు చేసే నీచ సంస్కృతి టీడీపీదని జీవీఎల్ విరుచుకుప‌డ్డారు.  టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ చెయ్యాల్సిన అవసరం త‌మకు లేద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఫోన్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. దీనిపై త‌మ దగ్గర ఆధారాలు ఉన్నాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని అనేక మంది రాజకీయ ప్రముఖుల ఫోన్ ల ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్న జీవీఎల్‌ టీడీపీ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందని అన్నారు. ఎవరెవరో ఫోన్ ట్యాపింగ్లు జరిగితే మీకెందుకంత భయం అని ఆయ‌న ప్ర‌శ్నించారు. దర్యాప్తు సంస్థలు విచారణలో భాగంగా ఏమైనా చేస్తాయని, వాటితో త‌మకు సంబంధం లేదని జీవీఎల్ న‌ర్మ‌గ‌ర్భ‌వ్యాఖ్య‌లు చేశారు.

కేంద్రం నిధుల్లో సగం వరకు దుర్వినియోగం అయ్యాయని జీవీఎల్ ఆరోపించారు. యూసీలకు సంబందించి అధికారులు మాత్రమే మాట్లడుకునే విషయం కాదని ఆయ‌న పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా రాజకీయలపైనే దృష్టి పెట్టారని మండిప‌డ్డారు. ప్రజల్ని మోసం చేస్తూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విరుచుకుప‌డ్డారు.రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందంటూ ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాల్లో ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. నిధుల ఖర్చుల వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత లేని సమాధానాలు చెబుతోంద‌న్నారు. పనులు చెయ్యకుండా నిధులు దారి మళ్లించినట్లు కేంద్రానికి అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. వందల కోట్లు ప్రజాధనాన్ని ప్రచార ఆర్భాటాలకు వాడుతున్నారని ఆరోపించారు. ఎక్కడ ఎక్కడ ఏ పనులు చేశారో లెక్కలు చెప్పండి అని ప్ర‌శ్నించారు. వెనుకబడిన జిల్లాలకు చేసిన ఖర్చులు వివరాలు ప్రజలకు తెలుసేలా వార్తా మాధ్యమాల్లో చెప్పాల‌న్నారు. దోలేరా తప్ప గుజరాత్‌లో మరొక నగరం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెద్ద నగరాలు నిర్మించడం కేంద్రం ప్రాజెక్టు అని అందులో దోలేరా ఒకటని వివ‌రించారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్  హబ్ కి ఇప్పటి వరకూ భూమి ఇవ్వలేద‌ని తెలిపారు. వైజాగ్-చైన్నై కారిడార్‌ కు భూ సమీకరణ చేసి ఇవ్వలేదని తెలిపారు. ఈ రెండు కీల‌క ప్రాజెక్టుల‌ అభివృధ్ధికి సహకరిస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయ‌న్నారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో టీడీపీ నేతలు గుమ్మడికాయ దొంగల్లా వ్యవహారిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎయిర్ ఏషియా విషయంలో రాష్ట్రంలో ప్రభుత్వ ప్రముఖులు ఎందుకు కలవరం చెందుతున్నారని ప్ర‌శ్నించారు. తప్పు చేసినవాళ్ళ లాగా ప్రభుత్వ ప్రముఖులు ఎందుకు భయపడుతున్నారని నిల‌దీశారు. ఎయిర్ ఏషియాలో సీబీఐ విచారణ జరుపుతోందని, నిజాలు బయటకి వస్తాయని తెలిపారు.

Tags:    

Similar News