మీ లుక‌లుక‌లు మీరు చూసుకోక నా గురించి ఎందుకు: బీజేపీ ఎంపీ ఫైర్!

Update: 2022-07-23 05:20 GMT
విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా లేదు. ట్విస్టుల మీద ట్విస్టులతో రోజుకో మ‌లుపు తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ త‌న‌పై కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎంపీ సీఎం ర‌మేష్ ప‌రోక్షంగా మండిప‌డ్డారు. మీ పార్టీ లుక‌లుక‌లు మీరు చూసుకోక నా గురించి మీకెందుకంటూ సోష‌ల్ మీడియా సాక్షిగా ధ్వ‌జ‌మెత్తారు. అయితే సీఎం రమేష్.. పార్టీ పేరును, వ్య‌క్తి పేరును పేర్కొన‌క‌పోయినా ఆయ‌న కేశినేని నానిని ల‌క్ష్యంగా చేసుకునే ట్వీట్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తాను చేసిన‌ ట్వీట్ లో.. "నాపై అసందర్భంగా, సత్యదూరమైన ఆరోపణలు.. కల్పితాలు ప్రచారం చేయడం మాని తమ కుటుంబ వ్యవహారాలు, వాళ్ల పార్టీలో లుకలుకలు సరిచేసుకోవడం మీద దృష్టిపెడితే మంచిదని సూచిస్తున్నాను. ఊహలకు, ఊహాజనిత వార్తలకు నిజాలు, ఆధారాలు అవసరం లేదు" అంటూ పేర్కొన్నారు.

ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ త‌న‌పై కేశినేని నాని చేసిన విమ‌ర్శ‌ల‌కు ప్ర‌తిస్పంద‌న‌గానే ర‌మేష్ ట్వీట్ చేశార‌ని అంటున్నారు. అందులో మీ కుటుంబ వ్య‌వ‌హారాలు అని పేర్కొంది.. కేశినేని నాని, ఆయ‌న సోద‌రుడు కేశినేని చిన్ని మ‌ధ్య విబేధాలు ఉన్నాయ‌ని గుర్తు చేయ‌డానికేన‌ని అంటున్నారు.

అలాగే మీ పార్టీలో లుక‌లుక‌ల‌పై దృష్టి సారించండి అని అన్న‌ది కూడా టీడీపీ అధిష్టానానికి, కేశినేని నానికి.., అలాగే బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరా త‌దిత‌రుల‌తో కేశినేనికి ఉన్న వివాదాల గురించి గుర్తు చేయ‌డానికే సీఎం ర‌మేష్ ఈ ట్వీట్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా కేశినేని నాని నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతూ... టీడీపీలో,చంద్రబాబు ఇంట్లో ఏం జరిగినా సీఎం రమేష్ కు వెంటనే తెలిసిపోతుందని చెప్పుకొచ్చారు. తాజాగా చంద్రబాబు నిర్వహించిన ఎంపీల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సైతం సీఎం రమేష్ కు వెంటనే తెలిశాయని చెప్పారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా.. సీఎం రమేష్ ద్వారా ఆపరేషన్ జరుగుతుందంటూ.. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ ఎంపీ సీఎం ర‌మేష్ ట్వీట్ చేశార‌ని చెబుతున్నారు.

దీంతో.. రానున్న రోజుల్లో కేశినేని నాని రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అలాగే సీఎం రమేష్ చేసిన ట్వీట్ సైతం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ నేప‌థ్యంలో కేశినేని నాని.. సీఎం ర‌మేష్ కు ఎలా కౌంట‌ర్ ఇస్తార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News