టి కాంగ్రెస్ గొంతుపై బీజేపీ కత్తి

Update: 2022-06-02 03:28 GMT
ఆ రెండు పార్టీల నాయ‌క‌త్వాలూ ఎవ‌రి వారే అన్న విధంగా ఉంటున్నాయి కానీ పైకి క‌నిపించినంత శత్రుత్వం లోప‌ల  లేదు అన్న‌ది కాంగ్రెస్ మాట. ఆ మాట ఎలా ఉన్నా కూడా కాంగ్రెస్ నేర్చుకోవాల్సింది. నెగ్గుకు రావాల్సింది కూడా ఆ రెండు పార్టీల నుంచే..! బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ దూసుకుపోయే నైజంలో బాగానే ఉన్నాయి. ఓ విధంగా తిట్ల రాజ‌కీయంలో కూడా పోటీ ప‌డుతూనే ఉన్నాయి.

ఘోరాతి ఘోర‌మైన రీతిలో తిట్ల పురాణం వినిపిస్తున్న ఈ నేత‌ల‌కు కాంగ్రెస్ అయితే కౌంట‌ర్లు ఇవ్వ‌లేక‌పోతోంది. మొద‌ట్లో కొంత రేవంత్ త‌న‌దైన శైలిలో మాట్లాడినా త‌రువాత ఆయ‌న కూడా త‌గ్గిపోయారు. దోస్తీ కార‌ణంగా కాంగ్రెస్ పోయేదెంత వ‌చ్చేదెంత‌? అన్న‌ది ఓ సారి ఆ పార్టీ చ‌ర్చించుకోవాలి. వాస్త‌వానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ వెళ్లే ఛాన్స్ ఉండేది కానీ ఆ ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టాయి.

ఈ ద‌శ‌లో బీజేపీ కి భాగ్య న‌గ‌రిలో కొన్ని చోట్ల ఉన్న ప‌ట్టు కార‌ణంగా అది గెల‌వ‌క‌పోయినా కాంగ్రెస్ ఓట‌మికి కార‌ణం అవుతుంది. క‌నుక‌నే టీఆర్ఎస్, బీజేపీ ప‌ర‌స్ప‌ర స్నేహంతో ముందుకు వెళ్తున్నాయ‌ని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. వీటిని అర్థం చేసుకుని అభ్య‌ర్థుల ఎంపిక చేస్తే మేలు.

ఈ నేప‌థ్యాన వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లు టీ కాంగ్రెస్‌-కు అత్యంత కీల‌కం కానున్నాయి. ఎందుకంటే వ‌రుస రెండు ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన కాంగ్రెస్ కు రానున్న కాలం మ‌రింత ప‌రీక్షా స‌మ‌యం కానుంది. ఈ ద‌శ‌లో కాంగ్రెస్ నాయ‌క‌త్వం కొంత ప్ర‌క్షాళ‌న కావాల్సి ఉంది. మార్పు రావాల్సింది ఉంది. ఈ ద‌శ‌లో టీ కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇంకా క్షేత్ర స్థాయిలో పాతుకుపోవాల్సిన స‌మ‌యం ఆస‌న్నం అయింది.

ఇప్పుడిక గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ  భ‌విష్య‌త్ పై సంబంధిత ఫ‌లితాల ప్ర‌భావం త‌ప్ప‌క ఉండ‌నుంది. ఈ దశ‌లో తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్,  మోడీ ఇద్ద‌రూ మంచి స్నేహితులు అని, ఇక్కడ కొట్టుకుంటుంటారు కానీ వీరి స్నేహం ఢిల్లీలో స‌జావుగానే సాగుతుంద‌న్న అర్థం ధ్వ‌నించేలా గ‌ల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అంటూ వ్యాఖ్య‌లు చేశారు.

వాస్త‌వానికి టీ కాంగ్రెస్ కు ఇప్పుడు మాట‌ల వేడి పుట్టించ‌డం క‌న్నా ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుని తీరడ‌మే ముఖ్యం. పార్టీని బ‌తికించే నేత‌లు, పార్టీలో కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రుగులు తీయించే నేత‌లు కావాలి. మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్య‌లు ఎలా ఉన్నా కూడా ఇక‌పై ఆయ‌న చెప్పిన విధంగా వ‌చ్చే ఎన్నిక‌ల వేళ 70 సీట్లు తెచ్చుకుంటే కాంగ్రెస్ మ‌రో ప‌దేళ్లు హాయిగా రాజ‌కీయం చేసేయొచ్చు. కానీ ఆ విధంగా ప‌రిణామాలు ఉన్నాయా ? అన్న‌దే సందేహం. పార్టీని న‌డిపే రాహుల్ లేదా పార్టీని న‌డిపే రేవంత్ లాంటి వారితోనే అన్నీ సాధ్యం కావు. ఇప్ప‌టికే గ్రూపు రాజ‌కీయాల‌తో విసిగి వేసారి పోతున్న కాంగ్రెస్ లో మున‌ప‌టి  ఉత్సాహం లేదు అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఉనికి ని కాపాడుకునేందుకు మ‌ళ్లీ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స్థాయి నాయ‌కులు పాద‌యాత్ర చేప‌డితే ఫ‌లితాలు ఆశించిన విధంగా ఉంటాయి.
Tags:    

Similar News