ప్ర‌తిప‌క్షాన్ని మెచ్చుకుంటున్న అధికార పార్టీ!

Update: 2016-12-14 21:30 GMT
రాజ‌కీయాల్లో బ‌లప‌డాల‌నుకునే వారు స‌హ‌జంగా ఏం చేస్తారు?  పార్టీ నేత‌ల్లో ధైర్యం నింప‌డం ఒక‌వైపు, కొత్త నేత‌ల‌ను పార్టీ వైపు మ‌ర‌లేల చేయ‌డం ఇంకోవైపు కొన‌సాగిస్తారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీలో దీనికి రివ‌ర్స్ జ‌రుగుతోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కేంద్ర నాయకత్వం ఆశిస్తుంటే కొత్తవారిని విజయవంతంగా బయటకు పంపించడంలో రాష్ట్ర పార్టీ సీనియర్లు బిజీగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తవారు చేరకుండా, చేరిన వారిని వారంతట వారే వెళ్లిపోయేలా చక్రం తిప్పుతున్న తమ నేతల వైఖరితో పార్టీ తిరోగమిస్తోందని బీజేపీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. పార్టీ బ‌లోపేతం విష‌యంలో కేంద్రంలో-రాష్ట్రంలో ఉన్న త‌మ‌కంటే ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళుతూ బ‌ల‌ప‌డుతోంద‌ని విశ్లేషిస్తున్నారు.

గత ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీలో చేరడం రాష్ట్ర బీజేపీ నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కొద్ది తేడాతో వైసీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ చేతిలో ఓడిన వెల్లంపల్లికి బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు. తన చేతిలో ఓడిన జలీల్ తాజాగా తెదేపాలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ తనకు ఇవ్వదన్న అనుమానం ఉంది. ఈ అనుమానంతోనే వెల్లంపల్లి వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు గత నెలలోనే మీడియాలో షికార్లు చేసినా, రాష్ట్ర నాయకత్వం ఆయనను పిలిచి చర్చించి భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించలేదు. సామాజికవర్గమే కాకుండా, ఆర్ధికంగా కూడా బలంగా ఉన్న వెల్లంపల్లిని తామే చేతులారా వేరే పార్టీకి పంపించామని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌ లో కేంద్ర-రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన పురంధ్రీశ్వరి - కావూరి సాంబశివరావు - కన్నా లక్ష్మీనారాయణ వంటి ప్రముఖులు కూడా ప్రస్తుతం నామ‌మాత్రంగానే మిగిలిపోవడం వారితోపాటు పార్టీలో చేరిన కార్యకర్తలకు కూడా మింగుడుపడటం లేదు. వీరిలో కన్నా కాంగ్రెస్‌ లో 20 ఏళ్లు మంత్రిగా పనిచేసి - పీసీసీ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన స్థాయి నేత. పురంధ్రీశ్వరి కూడా పదేళ్లు కేంద్రమంత్రిగా పనిచేసి, ఒకానొక దశలో సీఎం పదవికి పోటీ పడిన నేత. వీరిద్దరి హోదా, స్థాయి, అనుభవంతో పోలిస్తే బీజేపీలో ఆ స్థాయి ఉన్న నేతలు కనిపించరు. అలాంటి నేతలకు పార్టీలో ఆదరణ లేని పరిస్థితి ఉందంటున్నారు.

ఇలా సీనియ‌ర్ల‌కు పార్టీలో ఎలాంటి గౌర‌వం ద‌క్క‌క‌పోవ‌డం మ‌రోవైపు స‌త్తా ఉన్న జూనియ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంతో బీజేపీ ఎలాంటి పురోగ‌తి లేకుండా నామ‌మాత్రంగా మిగిలిపోతోంద‌ని ఆంధ్ర‌ప్రదేశ్‌ కు చెందిన క‌మ‌ళ‌నాథులు వాపోతున్నారు. అధికారంలో ఉన్న త‌మ‌కంటే ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ ఈ విష‌యంలో మెరుగ్గా వ్యవ‌హ‌రిస్తోంద‌ని అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెప్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News