చిన్నమ్మ చేతికి బీజేపీ పగ్గాలు... టార్గెట్ వారే...?

Update: 2022-08-23 16:30 GMT
బీజేపీ ఆపరేషన్ తెలంగాణా అనే అంతా ఇప్పటిదాకా అనుకున్నారు. కానీ సడెన్ గా ఆ పార్టీ వైఖరిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. కొడితే అటూ ఇటూ కొట్టాలి ఏపీ విషయంలో లేట్ ఎందుకు అన్నట్లుగా ఇపుడు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఉమ్మడి ఏపీగానే ఉంది కాబట్టి ఒకచోట జరిగే పరిణామాలు రెండవ చోట ప్రభావం చూపుతాయని అంచనాలతో బీజేపీ ఏపీలో కూడా చురుకుగా పావులు కదుపుతోంది.

దాంతో ఏపీలో జగన్ కి చంద్రబాబుకీ కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం ఏం చేయాలనుకుంటోందో ఒక పట్టాన అర్ధం కావడంలేదు. ఢిల్లీలో షేక్ హ్యాండ్ తనకు ఇచ్చారని చంద్రబాబు మురిసేలోపే జగన్ తో లంచ్ కి మోడీ అటెండ్ అయి టోటల్ బ్యాలన్స్ చేశారు. దాంతో వైసీపీ ఖుషీగా ఉండగా అమిత్ షా హైదరాబాద్ టూర్ పెట్టుకుని ప్రత్యేకంగా మీడియా దిగ్గజం రామోజీరావుని కలసి టీడీపీకి స్వీట్ తినిపించారు. ఇంకేముంది బీజేపీ టీడీపీ పొత్తు అనివార్యం అని అంతా అనుకున్నారు. ఆ ఆనందంలో పసుపు పార్టీ అలా ఉండగానే జూనియర్ ఎన్టీయార్ అమిత్ షా డిన్నర్ మీట్ పెట్టి టీడీపీ నోట్ల పచ్చి వెలక్కాయ పెట్టేశారు.

ఇదంతా చూసిన వారికి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి అధికారమే ముఖ్యం తప్ప మనుషులతో పని లేదని అర్ధమవుతోంది. వారికి ఆ టైమ్ కి ఉపయోగపడే వారినే పావులుగా వాడుకుంటారు అని కూడా అర్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఏపీలో బలమైన కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తున్న బీజేపీ ఇపుడు చకచకా గేరు మార్చేస్తోంది. ఏపీలో త్వరలోనే పార్టీ పరంగా గణనీయమైన మార్పులు చేయడం ద్వారా పార్టీ పగ్గాలను తిరిగి కమ్మలకు అప్పగించాలని చూస్తోంది.

గతంలో సుదీర్ఘ కాలం పాటు విభజన ఏపీకి హరిబాబు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన కమ్మ సామాజికవర్గమే. ఆ టైమ్ లో కమ్మల సపోర్ట్ కొంత దాకా  బీజేపీకి దక్కింది. అయితే నాడు టీడీపీ బలంగా ఉండడంతో పూర్తి స్థాయిలో వారిని ఇటు వైపుగా తిప్పుకోలేకపోయారు. అయితే ఇపుడు పరిస్థితి మారిందని బీజేపీ పెద్దలు ఊహిస్తున్నారుట. ఏపీలో టీడీపీ గ్రాస్ రూట్లో బాగానే ఉన్నా ఆ పార్టీలో నాయకత్వ సమస్య ఉందని బీజేపీ అంచనా కడుతోంది.

చంద్రబాబు సమర్ధుడు అయినా ఏజ్ ఫ్యాక్టర్ తో ఆయనను పూర్తిగా నమ్మలేని స్థితి ఉంది. ఇక ఆయన కొడుకు నారా లోకేష్ మీద సొంత పార్టీ వారికే ఈ రోజుకీ నమ్మకం కలగడంలేదు అంటున్నారు. దాంతో టీడీపీలో ఉన్న ఈ నాయకత్వ సంక్షోభాన్ని తమకు అనువుగా మార్చుకుంటే బలమైన కమ్మలు బీజేపీకి సపోర్ట్ గా నిలుస్తారు అని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ క్రమంలో తొందరలోనే బీజేపీ ప్రెసిడెంట్ గిరీని కమ్మలకు అప్పగించాలని చూస్తోందిట. ప్రస్తుతానికి బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న సోము వీర్రాజు వల్ల పార్టీ ఏ మాత్రం ఎత్తిగిల్లలేదని బీజేపీ భావిస్తోంది. దాంతో పాటు ఆయన గోదావరి జిల్లాల కాపు అయినప్పటికీ ఆ వర్గం మద్దతు సంపాదించలేకపోయారు అన్న అసంతృప్తి కూడా ఉంది. కాపులు పవన్ చుట్టూ ర్యాలీ అవుతున్నారు తప్ప బీజేపీ వైపు చూడడంలేదు. ఈ సంగతి గ్రహించే అమరావతి ఏకైక రాజధాని అంటూ బీజేపీ కొత్త స్టాండ్ తీసుకుంది.

ఇపుడు దానికి మరింత మద్దతు ఇచ్చేలా పార్టీ ప్రెసిడెంట్ గా కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని తెచ్చి పెడితే ఆ వర్గం తమ వైపు చూస్తుందని లెక్కలు వేసుకుంటున్నారుట. ఇక్కడ పురంధేశ్వరి ఎంపిక ఎందుకు అంటే ఆమె ఎన్టీయార్ కుమార్తె. పైగా తెలుగుదేశం తో కూడా పరిచయాలు ఉంటాయి. సినీ హీరో జూనియర్ ఎన్టీయార్ లాంటి వారితో చుట్టరికం కూడా మరో ముఖ్య కారణం. దాంతో పాటు ఆమె ఈసరికే సమర్ధ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు.

దాంతో ఆమెను బీజేపీ తరఫున ప్రెసిడెంట్ చేయడంతో పాటు పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తే కమ్మలు గంపగుత్తగా ఈవైపునకు మళ్ళుతారు అన్న ఆలోచనలు ఏవో బీజేపీ పెద్దలకు ఉన్నాయట. మొత్తానికి చూస్తే చంద్రబాబును బీజేపీ దగ్గరకు తీస్తున్నట్లే కనిపిస్తూ టీడీపీ ఓటు బ్యాంక్ కే టెండర్ పెట్టేలా తనదైన రాజకీయం చేస్తోంది. మరి దీనిని బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. ఇక బాబు వదిన బీజేపీ ప్రెసిడెంట్ అయితే అది టీడీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది కూడా తమ్ముళ్ళు ఆలోచించుకోవాలి అని అంటున్నారు.
Tags:    

Similar News