ప్రజాతీర్పును అవహేళన చేస్తున్న బీజేపీ, సేన!

Update: 2019-11-05 12:17 GMT
ఎన్నికల్లో ఆ రెండు పార్టీలూ కలిసి పోటీ చేశాయి. తమకు ఓటు వేయమని కలిసి అడిగాయి. రెండు కాషాయ కండువాలూ కలిసి ఎన్నికల ప్రచారం చేశాయి. ప్రజలు కూడా ఆ రెండు పార్టీలకూ కలిసి అధికారాన్ని కట్టబెట్టారు.

గతంతో పోలిస్తే ఇరు పార్టీలకూ కలిపి ప్రజలు సీట్లను తగ్గించారు. ఐదేళ్ల కిందటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేయలేదు. వేర్వేరుగా బరిలోకి దిగి ఇంతకన్నా ఎక్కువ సీట్లను సంపాదించాయి. అప్పుడేమో ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోయినా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ ఇరు పార్టీల వాళ్లూ.

ఈ సారి సీట్ల ఒప్పందంతో పోటీ చేశాయి ఇరు పార్టీలూ. అంటే.. తాము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ముందే ప్రజలకు చెప్పారు. అయితే ఫలితాలు వారికి అనుకూలంగానే వచ్చినా.. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నట్టుగా ఈ పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి.

గత నెల ఇరవై నాలుగుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఫలితాలు వచ్చాకా రెండో వారం గడుస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకూ ప్రభుత్వ ఏర్పాటు జరగలేదు.

సీఎం పీఠం కోసం బీజేపీ, శివసేనలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పదవి కోసం  పాకులాడుతూ ఉన్నాయి. పదవీ కాలాన్ని పంచాలని ఒకరు, పదవిని పంచుకునేది లేదని మరొక పార్టీ వాదిస్తూ ఉంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు సాగలేదు.

ఒకవేళ శివసేన-బీజేపీలు కలిసి పోటీ చేయకపోయి ఉంటే అదో లెక్క. అయితే కలిసి పోటీ చేసి, ఉమ్మడిగా మెజారిటీని సాధించి.. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో ఈ పార్టీలు గొడవ పడుతున్నాయి. అది కేవలం సీఎం సీటు కోసమే. ఇది ప్రజాతీర్పును అపహస్యం చేయడం కాదా? పదవే లక్ష్యంగా ఇరు పార్టీలూ గొడవ పడటం ఏమిటి? ఈ పరిణామాలను చూసి వీరికి జాయింటుగా ఓటేసిన ప్రజలను ఏమనుకుంటున్నట్టు? పోలింగ్ అయ్యాకా ప్రజలతో పనేంటి అన్నట్టుగా ఉంది ఈ పార్టీల తీరని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News