జమ్ములో బీజేపీ.. కశ్మీర్లో కాంగ్రెస్!

Update: 2018-10-21 06:04 GMT
జ‌మ్ముకశ్మీర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలు త‌మ స‌త్తాను చాటుకుంటున్నారు. జమ్ము మున్సిపల్ కార్పొరేషన్(జేఎంసీ)ను బీజేపీ కైవసం చేసుకోగా...కశ్మీర్‌ లోయలో కాంగ్రెస్ అధికారానికి దగ్గర్లో ఉంది. ఆ పార్టీ 157 స్థానాల్లో గెలువగా.. బీజేపీ 100 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికలను ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్ - పీడీపీ బహిష్కరించడంతో బీజేపీ - కాంగ్రెస్ - ఇండిపెండెంట్లకు భారీగా ప్రయోజనం చేకూరింది.

ఇటీవల జమ్ముకశ్మీర్‌ లో నాలుగు విడుతలుగా మున్సిపల్ ఎన్నికలు జరుగగా శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 12 మున్సిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇందులో ఐదు చోట్ల మెజారిటీ కొనసాగుతోంది. కాంగ్రెస్ 15 మున్సిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా అవతరించగా.. 11 చోట్ల మెజారిటీలో ఉన్నది. కశ్మీర్ డివిజన్ పరిధిలోని 42 మున్సిపాలిటీల్లో 178 వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. 74 వార్డులు గల శ్రీనగర్ మున్సిపాలిటీలో 16 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా - నాలుగు స్థానాల్లో బీజేపీ గెలిచింది. అయితే ఇక్కడ ఇండిపెండెంట్లు 53 వార్డుల్లో గెలుపొందడం విశేషం. లడక్ ప్రాంతంలోని లెహ్ - కార్గిల్ మున్సిపాలిటీల్లో బీజేపీ ఖాతా తెరువలేదు. లెహ్ మున్సిపాలిటీలోని మొత్తం 13 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కార్గిల్‌ లో ఆరు వార్డులను గెలుచుకుంది. జమ్ము ప్రాంతంలో 36 మున్సిపాలిటీలు - కౌన్సిల్‌ లు ఉండగా 15 చోట్ల బీజేపీ - 12 చోట్ల ఇండిపెండెంట్లు - 5 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ 169 వార్డుల్లో - ఇండిపెండెంట్లు 167 చోట్ల - కాంగ్రెస్ 96 వార్డుల్లో గెలుపొందింది. శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శంకర్‌ పురా స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి బషీర్ అహ్మద్ మీర్‌ కు ఎనిమిది ఓట్లు వచ్చినప్పటికీ ఆయన గెలుపొందారు. ఇక్కడ మొత్తం తొమ్మిది ఓట్లే పోల్ అయ్యాయి. వేరే అభ్యర్థికి మిగిలిన ఒక ఓటు పడటం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News