పెద్ద నోటు డాలరైపోతోంది

Update: 2016-11-17 07:54 GMT
శత కోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు... పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు మొదట షాక్ తిన్నా మెల్లమెల్లగా ఇప్పుడు తమ బుర్రలకు పదునుపెట్టి మోడీ ప్లాన్లకు విరుగుడు మార్గాలు వెతుకున్నారు. మోడీ నిర్ణయం వచ్చిన మొదట్లో వెంటనే బంగారం కొనుగోలు చేసి కొంత నల్లధనాన్ని మార్చుకున్న బడాబాబులు తాజాగా కొత్త రూటు పట్టారు. మన కరెన్సీ పోతే పోయింది.. ఫారిన్ కరెన్సీ ఉందిగా అంటూ డాలర్ల కొనుగోలులో దిగారు.

నల్ల  కుబేరులు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లతో అమెరికన్‌ డాలర్లను సమకూర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడిన వెంటనే తొలి మూడు - నాలుగు రోజులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేశారు. దీంతో బంగారం ధర అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకూ రూ.30వేల వరకూ ఉన్న 10గ్రాముల బంగారం ధర ఒక దశలో నల్లబజారులో రూ.45వేల నుంచి రూ.50వేలకు కూడా చేరిందనే వార్తలు వచ్చాయి. ఇది గుర్తించిన ఆదాయపుపన్ను శాఖ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నోటీసులు జారీ చేయటం బ్లాక్ షీప్సన్నీ కొత్త రూటు కనిపెట్టాయి.

ఇప్పుడు వారంతా వాస్తవ ధర కన్నా సుమారు 30 శాతం అధిక మొత్తానికి డాలర్లు కొంటున్నారు. గిరాకీ భారీగా ఉండటంతో ప్రైవేటు వ్యక్తుల అంతర్గత క్రయవిక్రయాల్లో డాలర్‌ ధర అనూహ్యంగా పెరిగింది. వాస్తవానికి బుధవారం ఒక డాలరు విలువ భారతీయ కరెన్సీలో రూ.67.78గా ఉంది. కానీ నల్లకుబేరులు అక్రమమార్గాల్లో ఒక్కో డాలరును రూ.95 నుంచి రూ.వంద వరకు చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అధిక రేటు పెట్టి కొన్నా కొన్నాళ్లకైనా డాలరు రేటు పెరుగుతుందని అంచనాలు ఉండడం... ఉన్న నల్లధనంలో కొంతయినా సురక్షితంగా మళ్లించగలమన్న ప్లానుతో ఈ పని చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News