పోరాడిన గొంతే ప్రాణం తీసేసుకుందేంది కేసీఆర్?

Update: 2017-02-28 05:03 GMT
‘‘ఉమ్మడి పాలన మాకొద్దు. మాకు జరిగిన అన్యాయం చాలు. ఇంతకాలం జరిగిందేదో జరిగింది.. ఇక సీమాంధ్రుల దోపిడీ సాగనివ్వం. సొంతరాష్ట్రంలో సొంతంగా పాలించుకుంటాం. సంక్షేమంతో సంతోషంగా ఉంటాం. మీ రాష్ట్రానికి మీరెళ్లిపోండి.. మా రాష్ట్రాన్ని మాకిచ్చేయండి’’ అంటూ ఉద్యమ గళంతో తెలంగాణ ప్రజల్ని ఉర్రూతలూగించిన గొంతు ఇప్పుడు బలవంతంగా ఆగిపోవటం సంచలనంగా మారింది.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ధూంధాం కళాకారుడి ఆత్మహత్య ఇప్పుడో చర్చగా మారింది. సొంత పాలనలో తెలంగాణరాష్ట్రం వెలిగిపోతుందని.. దోపిడీ పర్వానికి తెరపడి.. మంచి రోజులు వచ్చేస్తాయని నమ్మిన గొంతు.. తన నమ్మకం వమ్ము అయ్యిందన్న బాధో.. బతికే ధైర్యం సరిపోలేదో కానీ.. జీవితాన్నిఅర్దాంతరంగా ఆపేశాడో ధూంధాం కళాకారుడు.

తెలంగాణ రాష్ట్రం వచ్చి మూడేళ్లకు దగ్గరకు వస్తున్నా.. ఉపాధి లేకపోవటం.. ఉద్యమ ఫలాలు తన లాంటి ఉద్యమకారుడికి చేతికి అందకపోవటంతో తల్లడిల్లిన ధూంధాం కళాకారుడు.. 26 ఏళ్ల బొల్లం మధు ఆత్మహత్య చేసుకోవటం తెలంగాణ వాదుల్ని ఆవేదనకు గురి చేస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తిహవేలి గ్రామానికి చెందిన ఈ యువకుడు.. కాలేజీ చదువుతున్నరోజుల్లో విద్యార్థి జేఏసీలో క్రియాశీలకంగా వ్యవహరించేవాడు.

తెలంగాణ ధూంధాం కళాకారుల బృందంలో ముఖ్యసభ్యుడిగా ఉన్న మధు.. తన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేవాడు. 2011లో డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవటం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధికి మార్గం అంతుచిక్కకపోవటంతో కొద్దికాలంగా తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో జీవితం మీద విరక్తి చెందిన మధు.. ఈ నెల 23న ఇంటి వద్ద ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నారడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. సొంత రాష్ట్రంలో సొంత ప్రజల చేతిలో పాలనా పగ్గాలు ఉన్న వేళ.. ఉపాధి లేని వైనంతో ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తిస్తే మంచిదన్నవాదన వినిపిస్తోంది. ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ యువత కలల్ని సాకారం చేసే దిశగా ఆయన నిర్ణయాలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News