ముద్ర‌గ‌డపై కామెంట్‌ తో ఇరుక్కుపోయిన టీడీపీ

Update: 2016-08-30 15:43 GMT
కాపునాడు పేరుతో ఆందోళ‌న బాట ప‌ట్టిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంను టార్గెట్ చేయ‌బోయి తెలుగుదేశం పార్టీ ఇర‌కాటంలో ప‌డిందా?  తామే కాపుల‌కు కోటా ఇస్తామ‌ని ప్ర‌క‌టించుకునే క్ర‌మంలో ఆ పార్టీ బుక్ అయిపోయిందా?  పార్టీ త‌ర‌ఫున గ‌ళం విప్పిన‌ బోండ ఉమమాహేశ్వరావు ఈ మేర‌కు మ‌రింత గంద‌ర‌గోళంలో ప‌డేశారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

విలేక‌రుల స‌మావేశంలో  బోండా ఉమా మాట్లాడుతూ వెయ్యి కోట్ల రూపాయలను కాపు కార్పోరేషన్ ద్వారా మంజూరు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదని ప్ర‌శంసించారు. అలాంటి త‌మ పార్టీపై ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీపై కక్ష కట్టినట్లు వ్యవహరించడం ఎంత వరకు సబబని ప్ర‌శ్నించారు. ఎమ్మెల్యేగా - తెలుగుదేశం పార్టీలో మంత్రిగా - ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న ముద్రగడకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అర్థం చేసుకోలేకపోతున్నార‌ని ఎద్దేవా చేశారు. జేఏసీ ఉద్యమాలను ప్రభుత్వంపై ఉసిగొల్పే విధంగా ముద్ర‌గ‌డ‌ తీరు ఉందని ఉమా మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ముద్రగడ పధ్మనాభంపై బోండా ఉమా నిప్పుల వ‌ర్షం కురిపిస్తూ ప్ర‌శ్న‌లు సంధించారు. # ప్ర‌భుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే జేఏసీ అన‌టం ఏంటి?  పోరాటం ఎందుకు చేస్తున్నారు?తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పోరాటం వెయ్యికోట్ల రూపాయలు ఇచ్చినందుకా? మంజునాథ కమిషన్ వేసి త్వరితగతిన చేయమన్నందుకా? వైఎస్ రాజశేఖరరెడ్డి 8 కులాలకు బీసీ స్టేటస్ కల్పించి కాపు - బలిజ - తెలగ - వంటరి కులాలను మోసం చేసిన విషయం ముద్రగడకు తెలియదా? దీనిపై కాంగ్రెస్ పార్టీని ఒక్క ప్రశ్న అయినా వేశారా? అంటూ ప్ర‌శ్నించారు.

అన్ని కులాల ఆర్థిక - సామాజిక పరిస్థితుల వివరాలను సేకరించడానికి పల్స్ స‌ర్వేను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింద‌ని దీని త‌ర్వాతే త‌గు నిర్ణ‌యం ఉంటుంద‌ని బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు తెలిపారు. మంజునాథ కమిషన్ అన్ని జిల్లాలో పర్యటించి వినతులను విన్నతరువాత ఆ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపిస్తార‌ని అపుడే రిజ‌ర్వేష‌న్ల‌పై స్ప‌ష్టత వ‌స్తుంద‌ని బోండా ఉమా స్ప‌ష్టం చేశారు.  ప‌ల్స్ స‌ర్వే పూర్త‌యి జిల్లాల్లో మంజునాథ క‌మిష‌న్ స‌ర్వే ముగిసిన త‌ర్వాతే కాపుల కోటాపై క్లారిటీ వ‌స్తుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఉమా వ్యాఖ్య‌ల‌ను విశ్లేషిస్తున్న కాపు సామాజిక వ‌ర్గం ఇప్ప‌ట్లో త‌మ‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డం లేద‌ని కాపు నాయ‌కుడితోనే ప్ర‌భుత్వం తెలియ‌జెప్పింద‌ని వ్యాఖ్యానిస్తోంది. చూస్తుంటే క్లారిటీ ఇచ్చే క్ర‌మంలో ఉమా ఇర‌కాటంలో ప‌డేసిన‌ట్లుందనే చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News