ప్రాణాల్ని కాపాడిన డాక్టర్ల పేర్లను కొడుక్కు పెట్టిన ఆ దేశ ప్రధాని!

Update: 2020-05-03 09:30 GMT
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. ఒకప్పుడు ప్రపంచంలోని పలు దేశాల్ని పాదాక్రాంతం చేసుకున్న నాటి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి వెన్నుముక అయిన గ్రేట్ బ్రిటన్ కు ప్రధాని. అంతటి పవర్ ఫుల్ స్థానంలో ఉండి కూడా కరోనా కాటుకు గురి కాక తప్పలేదు. కరోనా బారిన పడటం ఒక ఎత్తు అయితే.. పరిస్థితి విషమించి ఆసుపత్రిలోని ఐసీయూ వరకూ వెళ్లాల్సిన దుస్థితిని బోరిస్ జాన్సన్ ఎదుర్కొన్నారు.

చివరకు వైద్యుల పుణ్యమా అని ఆయన ప్రాణాల్ని నిలుపుకున్నారు. వారి విషయంలో తనకున్న ఆరాధన భావాన్ని చేతల్లో చూపించారాయన. బోరిస్ ప్రియురాలు కేరీ సైమండ్స్ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చారు. చావు అంచుల వరకు వెళ్లిన ఆయన.. తన కుమారుడికి పేరు పెట్టే విషయంలో వినూత్నంగా వ్యవహరించారు. తనను కాపాడిన వైద్యుల పేర్లను కలిపి పెట్టుకున్నారు.

తన ప్రాణాల్ని కాపాడిన వైద్యుల్ని గుర్తు పెట్టుకునేలా తన కుమారుడికి తనకు వైద్యం చేసిన ఇద్దరు వైద్యుల పేర్లు కలిసి వచ్చేలా నామకరణం చేశారు. విల్ ఫర్డ్ లారీ నికోలస్ జాన్సన్ గా నామకరణం చేయటం ఆసక్తికరంగా మారింది. ఇందులో విల్ ఫర్డ్ బోరిస్ తాత పేరు అయితే.. లారీ అన్నది ఆయన ప్రియురాలి తాత పేరు. నికోలస్ విషయానికి వస్తే.. డాక్టర్ నిక్ ప్రైస్.. నిక్ హర్ట్ ల ఉమ్మడి పేరుగా పెట్టుకున్నారు. తన ప్రాణాల్ని నిలిపిన వైద్యుల్ని తానెంతగా గుర్తు పెట్టుకున్నానన్న విషయాన్ని బ్రిటన్ ప్రధాని తన చేతలతో చేసి చూపించారని చెప్పక తప్పదు.
Tags:    

Similar News